organ transplant
-
అవయవ దానంలో ‘కార్పొరేట్’ కుట్రలకు చెక్?
సాక్షి, హైదరాబాద్: అవయవ మార్పిడి పేరుతో జరుగుతున్న కార్పొరేట్ దందాకు చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మానవ అవయవాల మార్పిడి చట్టం (టీహెచ్‌ఓఏ)– 1994లో ఉన్న కొన్ని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకొని కార్పొరేట్ ఆసుపత్రులు సాగిస్తున్న అవయవ మార్పిడి వ్యాపారాన్ని అడ్డుకొనేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 2014లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన టీహెచ్ఓటీఏ– తోటా (ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్)ను అడాప్ట్ చేసుకొన్న రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టంలో రాష్ట్రాలకు ఇచ్చిన హక్కులను సద్వినియోగం చేసుకొంటూ, కొన్ని నిబంధనలను మార్చేందుకు నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచనల మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదంతో త్వరలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఒక్కో కేసు నుంచి 9 ఆర్గాన్స్ విక్రయం జిల్లాల్లో గానీ, హైదరాబాద్‌లోని సాధారణ ప్రైవేటు ఆసుపత్రుల్లో గానీ బ్రెయిన్ డెడ్ అయిన కేసులు వెలుగు చూస్తే, కుటుంబసభ్యుల అనుమతితో ఆ విషయాన్ని ప్రభుత్వ ‘జీవన్‌దాన్’నోడల్ ఆఫీస్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి అవయవాలను సేకరించి ‘జనరల్ పూల్’కింద అవయవ మార్పిడి కోసం వేచి ఉన్న వారికి అమరుస్తారు. ఇక్కడే కార్పొరేట్ దందా మొదలవుతోంది. జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులతో ఒప్పందాలు కుదుర్చుకొనే కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు బ్రెయిన్ డెడ్ వ్యక్తిని హైదరాబాద్ ఆసుపత్రిలో చేర్పించి రికార్డులు మార్చి, బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ చేసి, అవయవాల మార్పిడిని వ్యాపారంగా మార్చుకుంటున్నారు. కార్పొరేట్ ఆసుపత్రికి వచ్చిన రోగిని కేవలం 24 గంటల్లోపు బ్రెయిన్ డెడ్‌గా డిక్లేర్ చేయడం ద్వారా ఒక అవయవం (సాధారణంగా కిడ్నీ) మాత్రమే జనరల్ పూల్‌కు పంపే అవకాశం ఉంటుంది. మిగిలిన గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, పాంక్రియాస్, చర్మం, పేగులు, శుక్లాలు వంటి 9 అవయవాలను కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు విక్రయించుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. జనరల్ పూల్‌కు వాటా పెంచే సూచన కార్పొరేట్ ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి ఎక్కువ సంఖ్యలో జనరల్ పూల్‌కు ఆర్గాన్స్‌ను తీసుకునేలా నిపుణుల కమిటీ సూచనలు చేసినట్లు తెలిసింది. కార్పొరేట్ ఆసుపత్రిలో అవయవ మార్పిడికి సిద్ధంగా ఉన్న వ్యక్తికి అవసరమైన అవయవాన్ని అమర్చి, మిగతా అవయవాలను జనరల్ పూల్‌కు ఇవ్వడం, వాటిలో ‘జీవన్‌దాన్’లో నమోదై ఉన్న వారికి కనీసం 50 శాతం ఆర్గాన్స్‌ను అందించాలని చెప్పింది. దీనివల్ల కార్పొరేట్ దందాకు చెక్ పెట్టాలని భావిస్తోంది. డిక్లరేషన్ సమయాన్ని మార్చాలి ప్రస్తుత చట్టంలో ఆస్పత్రికి వచ్చిన రోగికి చికిత్స చేస్తూ, మెదడు స్పందించడం మానేస్తే... 24 గంటల్లోపు బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఆసరాగా తీసుకొన్న కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు జిల్లాల నుంచి వచ్చిన రోగులను ఆసుపత్రిలో చేర్చుకొని రికార్డులు మార్చి కొన్ని గంటల ముందు బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ చేసి అవయవాలను సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ టైమ్‌ను 48 గంటలు, లేదా 74 గంటలకు పెంచితే జిల్లాలు, దూరప్రాంతాల నుంచి వచ్చే రోగుల కుటుంబాలు, ఆర్ఎంపీలు, ఇతర డాక్టర్లతో బేరసారాలాడి ఆర్గాన్స్‌ను సేకరించే అవకాశం కోల్పోతారని కమిటీ భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి కీలక మార్పులు సూచించినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే అవయవదానాలపై.. రాష్ట్రంలో వేలాది ఆసుపత్రులు ఉన్నప్పటికీ అవయవ మార్పిడి చేసే అనుమతి హైదరాబాద్‌లోని 41 ఆసుపత్రులకు మాత్రమే ఉంది. అందులో ప్రభుత్వ పరిధిలోని నిమ్స్, గాం«దీ, ఉస్మానియా, ఈఎస్ఐసీ ఆసుపత్రులు.. కాగా, మిగతా 37 ఆసుపత్రులు కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులే. ఇవి కాకుండా కరీంనగర్‌లోని అపోలో రీచ్, హైదరాబాద్‌లోని మరో ఏడు ఆసుపత్రులకు అవయవాలను సేకరించి భద్రపరిచేందుకు మాత్రమే అనుమతి ఉంది. నాలుగు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన అవయవాలను జనరల్ పూల్‌లోనే వరుస సంఖ్య ఆధారంగా కేటాయిస్తారు. ప్రస్తుతం జీవన్‌దాన్ వద్ద ఆర్గాన్స్ కోసంవేచి చూస్తున్నవారు: 4,000 -
మహోన్నత దానం మరింత వేగం!
సాక్షి, హైదరాబాద్: అవయవ దానం ఎంతో ఉదాత్తమైనది. సంకల్ప బలం ఉంటే గానీ సాధ్యమయ్యే విషయం కాదు. కొంతమంది కళ్లు, మూత్రపిండాలు ఇతర అవయవాలు దానం చేస్తారు. దాతలు చనిపోయాక వాటిని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. తమవారి ప్రాణాలు కాపాడేందుకు కుటుంబసభ్యులు కిడ్నీ దానం చేయడం కూడా అడపాదడపా జరుగుతుంటుంది. గతంలో అవయవ దానం అంటే చనిపోయిన వారి కళ్లు దానం చేయడమే అనుకునేవారు. కానీ పదేళ్లలో పెరిగిన అవగాహన వల్ల కళ్లతో పాటు ఇతర అవయవాల దానం కూడా పెరిగింది. అవయవ మార్పిడితో పునర్జన్మ పొంది ప్రాణాలు కాపాడుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. తాజాగా ‘తోటా’ అమలు తీర్మానంతో ఇది మరింత ఊపందుకునే అవకాశం ఏర్పడింది. గత పదేళ్లలో రాష్ట్రంలో అవయవాలను దానం చేసిన వారి సంఖ్య 1,594 కాగా.. ఎవరైనా చనిపోయిన తర్వాత, బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి సేకరించిన కంటి కారి్నయా, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఇతర అవయవాలను ట్రాన్స్ ప్లాంట్ చేయడం ద్వారా పన్నెండేళ్లలో ఏకంగా 6 వేల మంది పునర్జన్మ పొందారు. ఇంకా 3,823 మంది అవయవ మార్పిడి కోసం రాష్ట్ర ప్రభుత్వ ‘జీవన్‌దాన్’ కార్యక్రమం కింద నమోదు చేసుకున్నారు. దీనిని బట్టే రాష్ట్రంలో అవయవ దానం, అవయవ మార్పిడిపై ప్రజల్లో అవగాహన ఎంతగా పెరుగుతోందో స్పష్టమవుతోంది.2021 నుంచి ఏటా 700 సగటుతో అవయవ మార్పిడి అవయవ మార్పిడిలో దేశంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ అవయవ మార్పిడి రేటు 1.9 పర్ మిలియన్ పాపులేషన్ (పీఎంపీ)గా ఉంది. ఇది జాతీయ సగటు (0.65 పీఎంపీ) కంటే చాలా ఎక్కువ. తెలంగాణలో కూడా చైతన్యం పెరగడంతో 2021 నుంచి ప్రతి ఏటా 700 సగటుతో అవయవ మార్పిడి కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఊపిరితిత్తులు, కాలేయం, కంటి కారి్నయా మార్పిడిలు ఎక్కువగా ఉండగా, బ్రెయిన్ డెడ్ అయిన వారి ద్వారా సేకరించి గుండెను మార్చే శస్త్రచికిత్సలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ నెలలో ఇప్పటివరకు నాలుగు గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరగడం ప్రజల్లో పెరిగిన చైతన్యాన్ని సూచిస్తున్నాయి. సవరించిన చట్టాన్ని అమలు చేసేలా తీర్మానం రాష్ట్రంలో 1994 నాటి అవయవ మార్పిడి చట్టం ‘టీహెచ్‌ఓఏ’ (ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యుమన్ ఆర్గన్స్ యాక్ట్)ను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం గత పదకొండేళ్లుగా అమలు చేస్తూ వచ్చింది. దీంతో అవయవ మార్పిడి ఆశించిన స్థాయిలో జరగలేదు. కానీ ఇప్పుడు.. ఆ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2014లో తీసుకొచ్చిన ‘టీహెచ్ఓటీఏ–తోటా’ (ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యుమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్) చట్టాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేసేలా సోమవారం శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించింది. దీంతో రాష్ట్రంలో మరింత పారదర్శకంగా, మానవ అవయవాల వ్యాపారాన్ని నిరోధించి, అవసరమైన వారికి చట్టబద్ధంగా, ఎక్కువ సంఖ్యలో అవయవ మార్పిడి జరిగేందుకు అవకాశం ఏర్పడింది. ‘జీవన్‌దాన్’ ద్వారా పునర్జన్మ రాష్ట్ర ప్రభుత్వం ‘జీవన్‌దాన్’ కార్యక్రమం ద్వారా అధికారికంగా అవయవమార్పిడి ప్రక్రియను నిర్వహిస్తోంది. ఎవరికైనా వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా మూత్రపిండం (కిడ్నీ), గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, గుండె నాళాలు, కంటి కారి్నయా, క్లోమం (ప్యాంక్రియాస్) వంటి అవయవాలను మారుస్తున్నారు. 2013 నుంచి ఇప్పటివరకు 6,007 మందికి మార్చి కొత్త జీవితాన్ని అందించారు. ఈ 6,007 మందిలో అత్యధికంగా 2,394 మందికి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరగగా, కాలేయం (లివర్) మార్పిడి చికిత్సలు 1,462 మందికి జరిగాయి. 2013 నుంచి రాష్ట్రంలో గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు కూడా జరుగుతుండడం గమనార్హం. అప్పటినుంచి ఇప్పటివరకు 218 మందికి గుండె మార్పిడిలు జరగగా, 2017, 2022లో వరుసగా 32, 31 చొప్పున గుండె మార్పిడి చికిత్సలు జరిగాయి. ‘తోటా’తో వేగవంతం! ‘తోటా’ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా మానవ అవయవాల మార్పిడి ప్రక్రియ వేగవంతం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్రెయిన్ డెడ్ అయినవారు, మరణించిన వారినుంచి అవసరమైన అవయవాలను సేకరించి, మార్పిడి చేసేందుకు వీలుగా నిబంధనల్లో మార్పులు జరిగాయి. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు.. వారి మనవళ్లు, మనవరాళ్లకు అవయవ దానం చేయడానికి ఈ చట్టం అనుమతి ఇస్తోంది. కొన్ని రకాల జన్యుపరమైన సమస్యల వల్ల పిల్లలకు కాలేయ మార్పిడి చేయాల్సి వచ్చినప్పుడు వారి గ్రాండ్ పేరెంట్స్ కాలేయ దానం (కాలేయంలో కొంత భాగం) చేయడానికి అవకాశం కలుగుతోంది. అలాగే 1995 నాటి నిబంధనల ప్రకారం బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేసే అధికారం న్యూరో సర్జన్లు, న్యూరో ఫిజీషియన్లకు మాత్రమే ఉంది. కొత్త నిబంధనల ప్రకారం ఫిజీషియన్, సర్జన్, ఇంటెన్సివిస్ట్, అనస్థీషియన్ కూడా బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేయడానికి అర్హులు. మరోవైపు అవయవాల అక్రమ రవాణా, అక్రమ మార్పిడి చేస్తే ఇప్పటివరకు రూ.5 వేల జరిమానా, 3 సంవత్సరాల వరకూ జైలు శిక్ష విధించేందుకే అవకాశం ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఒక కోటి రూపాయల వరకు జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఏర్పడింది. దాతల్లో 41 నుంచి 60 ఏళ్ల వారే ఎక్కువ అవయవ దాతల్లో 41 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల లోపు వారే అధికంగా ఉన్నారు. 2020 నుంచి అవయవ దానం చేసిన వారిని చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఐదేళ్లలో 41 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వారు 187 మంది అవయవదానాలు చేయగా, 51 నుంచి 60 ఏళ్లలోపు వారు 190 మంది ఉన్నారు. ఇక 61 నుంచి 70 వయస్సు గల వారు 88 మంది ఉన్నారు. అవయవదానం చేసిన యువకుల్లో 21 నుంచి 30 ఏళ్ల వయస్సు వారు 149 మంది ఉండగా, 31 నుంచి 40 ఏళ్ల లోపు వారు 140 మంది ఉన్నారు. ఇక 1 నుంచి 10 ఏళ్ల వయస్సు వాళ్లు ఆరుగురు, 11 నుంచి 20 ఏళ్ల లోపు వారు 64 మంది ఉన్నారు. 71 నుంచి 78 ఏళ్ల లోపు వారు 36 మంది ఉంటే, 81 ఏళ్లు పైబడిన వారు 2020లో ఇద్దరు, 2023లో ఒక్కరు వారి అవయవాలను దానం చేశారు. కాగా 2020 నుంచి అవయవ దానం చేసిన 863 మందిలో మహిళలు 672 మంది కాగా, పురుషులు కేవలం 191 మాత్రమే కావడం గమనార్హం. అవయవాల కోసం వెయిటింగ్లో 3,823 మంది అవయవ మార్పిడి కోసం ‘జీవన్‌దాన్’ వద్ద ఇంకా 3,823 మంది నమోదు చేసుకుని ఉన్నారు. నిమ్స్, ఉస్మానియా, గాం«దీ, ఈఎస్ఐతో పాటు హైదరాబాద్‌లోని 41 ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తారు. అత్యధికంగా నిమ్స్‌లో 620కి పైగా శస్త్రచికిత్సలు జరిగాయి. – డాక్టర్ శ్రీభూషణ్ రాజు (జీవన్‌దాన్ నోడల్ ఆఫీసర్) -
తొలిసారిగా వృద్ధుడికి ట్రిపుల్-ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్..!
ఆధునిక వైద్యశాస్త్రం కొంగొత్త వ్యాధులకు తగ్గట్టుగా పురోగమిస్తోంది. సవాలు విసిరే వ్యాధులకు తగ్గట్టుగా వైద్యులు కూడా సరికొత్త వైద్య విధానంతో అద్భుతాలు సృష్టంచి రోగులకు ప్రాణాలు పోస్తున్నారు. దీంతో అత్యంత క్రిటికల్‌గా ఉన్న రోగులకు కూడా నయం అయ్యి.. మంచిగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అచ్చం అలాంటి పరిస్థితితో మృత్యువుతో పోరాడుతున్న వ్యక్తికి ఊపిరి పోసి..కొత్త జీవితాన్ని ప్రసాదించారు. బతికే ఛాన్స్ లేనివాడికి అత్యాధునిక చికిత్సతో కొత్త ఆశను చిగురించేలా చేసి ఓ అద్భుతానికి నాంది పలికారు అమెరికన్ వైద్య బృందం.అమెరికాలోని ఒహియోకు చెందిన 64 ఏళ్ల డాన్ ఇలియట్ అనే వ్యక్తి అరుదైన జన్యుపరమైన అప్లా-1 అనే యాంటిట్రిప్సిన్తో పోరాడుతున్నాడు. అతడు 18 ఏళ్ల ప్రాయం నుంచి ఈ అరుదైన జన్యు పరిస్థితితో భాధపడుతున్నాడు. గత 20 ఏళ్లుగా మెడిసిన్‌తో నియంత్రణలో ఉంచుకుంటూ వచ్చాడు. కానీ ఈ వ్యాధి తీవ్రమై ఎంఫిసెమాకు దారితీసింది. యాంటిట్రిప్సిన్ అనే కీలకమైన ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయడంలో విఫలమవ్వడంతో ఈ జన్యు పరిస్థితి వస్తుంది. అయితే ఇన్నాళ్లు మందులకు అదుపులో ఉన్న ఈ వ్యాధి తీవ్రమై.. ఇలియట్ శరీరంలో ఒక్కో అవయవంపై దాడి చేయడం ప్రారంభించింది. దీంతో ముందుగా ఇలియట్ శరీరంలోని కాలేయం దెబ్బతింది, తర్వాత మూత్రపిండాల వైఫల్యానికి దారితీసింది అలా నెమ్మది నెమ్మదిగా ప్రాణాంతకంగా మారిపోయి.. చివరికి ఊపిరి తీసుకోవడమే అత్యంత కష్టంగా మారింది. దీంతో వైద్యులు ఇలియట్ ప్రాణాలు కాపాడేందుకు అవయవ మార్పిడి చేయక తప్పదని నిర్థారించారు. అతడి ప్రాణాలను రక్షించే ప్రయత్నంలో భాగంగా ట్రిపుల్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చింది. అంటే మరణించిన దాత నుంచి ఇలియట్కి కాలేయం, ఊపరితిత్తులు, మూత్రపిండాల మార్పిడి చేశారు. ఇలా ట్రిపుల్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న తొలి వ్యక్తిగా ఇలియట్ నిలిచాడు. ఈ సర్జరీని వైద్యులు 24 గంటల్లోనే పూర్తి చేశారు. అయితే ఇలియట్ పూర్తిగా కోలుకోవడానికి ఏకంగా ఆరు నెలలు పట్టింది. మొదట కొన్ని రోజులు లైఫ్ సపోర్ట్‌తో ఆరువారాలకు పైగా ఆస్పత్రిలోనే గడిపాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆరోగ్యం కుదుటపడుతుండటంతో డిశ్చార్జ్ చేసి పంపిచేశారు. తనకు ఈ అమూల్యమైన బహుమతిని అందించిన దాత కుటుంబ సభ్యలుకు కృతజ్ఞతలు తెలిపాడు ఇలియట్. ఇక్కడ వైద్యులు ఎక్కువ శస్త్ర చికిత్సలను నివారించేలా ఒకే దాత నుంచి మూడు అవయవాలను తీసుకున్నట్లు తెలిపారు. అందువల్లే డాన్ ప్రాణలను రక్షించడం సాధ్యమయ్యిందని అన్నారు. ప్రస్తుతం ఇలియంట్ ఆక్సిజన్ సిలిండర్లతో పనిలేకుండానే స్వయంగా ఊపిరి పీల్చుకుంటున్నాడని చెప్పారు.(చదవండి: గుమ్మడి పండంటి బిడ్డ... రిస్క్ టాస్క్..) -
కిడ్నీలు కుదేలు
మారుతున్న వాతావరణం, జీవనశైలి కారణంగా దేశంలో కిడ్నీ వ్యాధులు ఏటా పెరిగిపోతున్నాయి. అవయవాలు పాడై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారిలో అత్యధిక శాతం కిడ్నీ వ్యాధిగ్రస్తులే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఏటా కిడ్నీ మార్పిడి(ట్రాన్స్‌ప్లాంట్) కేసుల్లో వృద్ధి నమోదవుతూ వస్తోంది. 2013లో దేశవ్యాప్తంగా 4,037 కిడ్నీ మార్పిడి కేసులు నమోదు కాగా... ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ 2023 సంవత్సరానికి ఏకంగా 1,3426కు చేరింది. – సాక్షి, అమరావతినేషనల్ ఆర్గాన్, టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్(నోటో) విడుదల చేసిన 2023 వార్షిక నివేదిక ప్రకారం గత ఏడాది దేశం మొత్తం 16,542 అవయవ మార్పిడి కేసులు నమోదు కాగా, అందులో 81 శాతం.. అంటే 13,426 కిడ్నీ మార్పిడి కేసులే ఉండటం గమనార్హం. మొత్తం కిడ్నీ మార్పిడి కేసుల్లో 11,791 రక్తసంబంధికులు కిడ్నీలు దానం చేయగా, 1,635 కేసుల్లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి సేకరించిన కిడ్నీలు ట్రాన్స్‌ప్లాంట్ చేశారు.2023లో కిడ్నీ గ్రహీతల్లో ఎవరు ఎంతమంది అంటే.. పురుషులు: 8,486 (63%) మహిళలు: 4,939 (37%) ట్రాన్స్‌జెండర్: 1 -
‘గుండె’ను వీడని గమనం ‘కంటి’ని వదలని జ్ఞాపకం
ఓ పాత సినిమా.. కంటిచూపు దెబ్బతిన్న ఒక యువకుడికి, అంతక్రితమే మరణించిన మరో వ్యక్తి కళ్లను అమర్చుతారు.. ఆపరేషన్ సక్సెస్.. యువకుడికి చూపు బ్రహ్మాండంగా వచ్చేస్తుంది.. కానీ తరచూ ఎవరో వచ్చి తనను కత్తితో పొడుస్తున్నట్టుగా కళ్ల ముందు ఏదో దృశ్యం తారాడుతూ ఉంటుంది.. నిజానికి ఆ కళ్లకు సంబంధించిన వ్యక్తి చనిపోవడానికి కారణమైన ఘటన అది.ఇదంతా జస్ట్ సినిమాటిక్ ఫిక్షన్, అవయవాల్లో అలా జ్ఞాపకాలేవీ నిక్షిప్తమయ్యే అవకాశమే లేదన్నది ఇటీవలి వరకు ఉన్న భావన. కానీ ఎవరి అవయవాలనైనా మరొకరికి అమర్చినప్పుడు.. వారి లక్షణాలు, అలవాట్లు కూడా వస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధన చేశారు.సెల్యులార్ మెమొరీతోనే ఇదంతా! శరీరంలో అన్ని కణాలకు కొంత జ్ఞాపకశక్తి ఉంటుందన్న ‘సెల్యులార్ మెమొరీ’ సిద్ధాంతాన్ని కొలరాడో వర్సిటీ శాస్త్రవేత్తలు తెరపైకి తెస్తున్నారు. ప్రతి వ్యక్తికి సంబంధించి కిడ్నీలు, గుండె, కళ్లు... వంటి వాటిలో.. వారి శారీరక, మానసిక లక్షణాల జ్ఞాపకాలు ఉంటాయని చెప్తున్నారు. వేరేవారికి ఈ అవయవాలు అమర్చినప్పుడు వారిని ఈ ‘సెల్యులార్ మెమొరీ’ ప్రభావితం చేస్తుందని.. అందుకే వారిలో కొత్త లక్షణాలు, అలవాట్లు కనిపిస్తాయని అంటున్నారు. మన కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేసుకుంటే కొత్త ఆప్షన్లు అందుబాటులోకి వచ్చినట్టుగా.. దీనిని పోల్చుకోవచ్చని చెప్తున్నారు.అవయవ మార్పిడికి ముందు, తర్వాత..శాస్త్రవేత్తలు యూనివర్సిటీ పరిధిలోని ఆస్పత్రిలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకున్న 47 మందిని స్టడీకి ఎంచుకున్నారు. ఇందులో కిడ్నీ, లివర్ నుంచి గుండె మార్పిడి వరకు చేయించుకున్నవారు ఉన్నారు. వారిలో అవయవ మార్పిడికి ముందు, తర్వాత ఉన్న అలవాట్లు, లక్షణాలను నమోదు చేశారు. అవయవ మార్పిడి తర్వాత ఎదుర్కొన్న అనుభవాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నో చిత్రమైన అంశాలు వెల్లడయ్యాయి.డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్‌ను నేరస్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపేశారు. అతడి గుండెను ఓ యువకుడికి అమర్చారు. అవయవ మార్పిడి తర్వాత తరచూ తనను ఎవరో దగ్గరి నుంచి కాల్చేస్తున్నట్టుగా కలలు వస్తున్నాయని.. బుల్లెట్ తాకినట్టుగా నుదుటిపై తీవ్రంగా నొప్పికూడా వస్తోందని ఆ యువకుడు డాక్టర్లకు చెప్పాడు.ఓ మూడేళ్ల పిల్లాడికి పవర్ రేంజర్స్ బొమ్మలంటే చాలా ఇష్టం. ఎప్పుడూ వాటితోనే ఆడుకునేవాడు. కానీ అతడికి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశాక.. ఒక్కసారిగా ఆ బొమ్మలను దూరం పడేయడం మొదలుపెట్టాడు. చిత్రమేంటంటే.. అతడికి అమర్చిన గుండె ఓ ఏడాదిన్నర చిన్నారిది. పవర్ రేంజర్స్ బొమ్మలను అందుకోవడానికి ప్రయత్నిస్తూ.. కిటికీ నుంచి పడిపోయి చనిపోయాడు.ఇవే కాదు. ఆపరేషన్‌కు ముందు వరకు ఎంతో ప్రశాంతంగా ఉండే వ్యక్తి.. తర్వాత తీవ్రంగా కోపతాపాలకు, తీవ్ర భావోద్వేగాలకు గురవడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. మరోవైపు ఎప్పుడూ మూడీగా ఉండే కొందరు.. ఆపరేషన్ తర్వాత యాక్టివ్‌గా మారడం, అందరితో చనువుగా ఉండటాన్ని గుర్తించారు. ఒక్కసారిగా కొత్త అలవాట్లు రావడం, అప్పటివరకు ఇష్టంగా చేసిన పనులు అసలే నచ్చకపోవడం, ఆధ్యాత్మిక నమ్మకాల్లోనూ మార్పులు రావడం వంటివీ గమనించారు. -
విజయవంతంగా గుండెమార్పిడి
సాక్షి, చైన్నె: చైన్నెకు చెందిన 22 ఏళ్ల యువకుడికి తిరుచ్చికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి గుండెను అవయవ మార్పిడి శస్త్ర చికిత్స ద్వారా అమర్చారు. విజయవంతం కావడంతో ఆ యువకుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. సోమవారం చైన్నె గ్లెనెగల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ గోవిని బాల సుబ్రమణియన్ వివరాలను మీడియాకు వివరించారు. చైన్నెకు చెందిన యువకుడికి గుండె మార్పిడి శస్త్ర చికిత్స అనివార్యమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం ద్వారా అతడిని చికిత్స నిమిత్తం మే నెలలో గ్లెనెగల్స్కు తరలించారు. ఆర్గాన్ రిజిస్టర్డ్ జాబితా మేరకు తిరుచ్చిలో బ్రెయిన్ డెడ్‌కు గురైన 30 ఏళ్ల వ్యక్తి గుండెను ఈ యువకుడికి దానం చేశారు. గత నెల 13వ తేదీ ఐదు గంటల పాటుగా గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. ప్రస్తుతం ఆ యువకుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. తనకు పునర్జన్మ దక్కడంతో వైద్యులతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నాడు. -
అవయవ మార్పిడికి దేశంలో 56 వేల మంది వెయిటింగ్
సాక్షి, అమరావతి: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అవయవాల మార్పిడి కోసం గత ఏడాది వరకు 56,852 మంది వెయిటింగ్లో ఉన్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం పార్లమెంట్లో వెల్లడించింది. అలాగే గతేడాది 16,041 మందికి అవయవాల మార్పిడి చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా అవయవాల వారీగా రోగులను జాతీయ రిజిస్ట్రీలో నమోదు చేస్తున్నట్లు తెలిపింది. మరణించిన దాతల నుంచి అవయవాలు స్వీకరించేందుకు రోగుల నమోదు రుసుము వసూలును నిలుపుదల చేసినట్లు చెప్పింది. గతంలో 65 సంవత్సరాల్లోపు వ్యక్తుల నుంచి మాత్రమే అవయవ దానాలకు అనుమతి ఉండేదని, ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా మరణించిన ఏ వయసు వ్యక్తి అయినా అవయవదానం చేయడానికి అనుమతించామని తెలిపింది. ఈ విధానపరమైన నిర్ణయాలను అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలకు సమాచారం పంపించినట్లు వెల్లడించింది. అవయవ మార్పిడిని ప్రోత్సహించడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సమావేశం నిర్వహించామని, ఒక దేశం ఒకే విధానం అమలు చేయాల్సిందిగా సూచించినట్లు పేర్కొంది. వెయిటింగ్లో ప్రాధాన్యతను నిర్ణయించడం కోసం ప్రారంభ నమోదును పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, దేశ వ్యాప్తంగా అవయవ దానం, మార్పిడిని ప్రోత్సహించడానికి మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశామని వెల్లడించింది. ఐదు ప్రాంతీయ అవయవాల మార్పిడి సంస్థలను, అలాగే ఆంధ్రప్రదేశ్‌తో సహా 20 రాష్ట్రాల్లో అవయవ మార్పిడి సంస్థలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. అత్యధికంగా కిడ్నీల కోసం, తరువాత కాలేయాల కోసం రోగులు ఎదురు చూస్తున్నట్లు వివరించింది. -
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి.. మరో అరుదైన ఘనత
సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రి మరో అరుదైన ఘనతను సాధించనుంది. అవయవ మార్పిడి నోడల్ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. నిధుల కేటాయింపు, టెండరు ప్రక్రియ పూర్తి కావడంతో ఆరునెలల్లో అత్యాధునిక హైఎండ్ మాడ్యులర్ ఆపరేషన్ ధియేటర్లు అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, తుంటి ఎముక, మోకాళ్లు వంటి అవయవ మార్పిడి, మూగ, చెవుడు, వినికిడిలోపం గల చిన్నారులకు కాక్లియర్ శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అవసరమైన ఆధునిక ఆపరేషన్ థియేటర్లను గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం ఎనిమిదవ అంతస్థులో నిర్మించనున్నారు. గాంధీలో చికిత్స పొందుతున్న రోగికి ఇతర దేశాలు, ప్రాంతాల నుంచి ఆపరేషన్ నిర్వహించేందుకు ప్రత్యేకంగా రోబోటిక్ సర్జరీ థియేటర్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. గాంధీలో అవయవ మార్పిడి థియేటర్ల కోసం ఐదేళ్ల క్రితమే ప్రతిపాదనలు సిద్ధం చేయగా, వైద్య మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో సాకారం అయ్యేదిశగా ముందడుగు పడింది. ► గాంధీఆస్పత్రి 8వ అంతస్తులో అందుబాటులో ఉన్న సుమారు లక్ష చదరపు అడుగుల వైశాల్యంలో రూ.35 కోట్ల వ్యయంతో ఆరు హైఎండ్ మాడ్యులర్ థియేటర్లను నిర్మిస్తున్నారు. అక్కడ ఉన్న నర్సింగ్ స్కూలు, హాస్టల్, నర్సింగ్, నన్ సిస్టర్స్ క్వార్టర్స్‌ను ఇతర ప్రదేశాలకు తరలించారు. ► అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఈ ఆపరేషన్ థియేటర్లు ఇన్ఫెక్షన్ కంట్రోల్ నూటికి నూరుశాతం ఉండటంతో సర్జరీల సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఆపరేషన్ థియేటర్లోని గాలిని పరిశుభ్రం చేసేందుకు లామినార్ ఫ్లో, వైరస్, బాక్టీరియాలను నాశనం చేసేందుకు హెఫాఫిల్టర్స్ను వినియోగిస్తారు. ► మాడ్యులర్ థియేటర్లకు అనుసంధానంగా ఐసీయు, స్టెప్‌డౌన్ వార్డులు, రోగులను సిద్ధం చేసేందుకు కౌన్సిలింగ్ విభాగం, సర్జరీ అనంతరం పర్యవేక్షణ విభాగాలను ఏర్పాటు చేస్తారు. నిష్ణాతులైన వైద్య, నర్సింగ్ సిబ్బందిని నియమిస్తారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ► ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో కొనసాగుతున్న సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాన్ని గాంధీకి తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. రోబోటిక్ సర్జరీలు నిర్వహించేందుకు సంబంధిత వైద్యులకు శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. ► ‘హైఎండ్ మాడ్యులర్ ధియేటర్ల టెండర్ల ప్రక్రియ కొలిక్కివచ్చింది. తెలంగాణ వైద్యవిద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ నేతృత్వంలో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. రోబోటిక్, మాడ్యులర్ థియేటర్లు అందుబాటులోకి వస్తే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సర్జరీలు చేయడం, వీక్షించే అవకాశం కలుగుతుంది’ అని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. (క్లిక్: Omicron BF.7 ముంచుకొస్తున్న నాలుగో వేవ్?!) -
‘గాంధీ’కి పోదాం!
సాక్షి, హైదరాబాద్: అవయవ మార్పిడి చికిత్సల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది నిరుపేదలకు వైద్యారోగ్య శాఖ చల్లని కబురు అందించింది. ప్రతిష్ఠాత్మక గాంధీ జనరల్ ఆస్పత్రిని అవయవ మార్పిడి చికిత్సలకు కేంద్రంగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ.40 కోట్లతో ఆస్పత్రి ప్రధాన భవనంలోని ఎనిమిదో అంతస్తులో ఆరు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయనుంది. తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించింది. ఇటీవల ఆస్పత్రిలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించిన వైద్యారోగ్య శాఖ... త్వరలో గుండె, కాలేయం, మూత్రపిండాలు, మోకాళ్ల మార్పిడి చికిత్సలనూ అందుబాటులోకి తీసుకురానుంది. ఇదంతా సవ్యంగా జరిగితే మరో నాలుగైదు నెలల్లో అవయవ మార్పిడి చికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో గుండె, కాలేయ మార్పిడి చికిత్సలకు రూ.20లక్షలకు పైగా ఖర్చవుతుంటే... మూత్రపిండాల మార్పిడికి రూ.4లక్షల వరకు ఖర్చవుతోంది. గాంధీలో ఈ సేవలు అందుబాటులోకి వస్తే... ఇక ఈ చికిత్సలన్నీ ఉచితంగా పొందొచ్చు. నోడల్ కేంద్రంగా ‘గాంధీ’... ఇప్పటి వరకు నిమ్స్ ఆస్పత్రిలో వెయ్యికి పైగా మూత్రపిండాల మార్పిడి చికిత్సలు, ఆరు గుండె మార్పిడి చికిత్సలు, ఏడు కాలేయ మార్పిడి చికిత్సలు జరిగాయి. ఆరోగ్యశ్రీ, ఇతర కార్డుల్లేని మధ్య తరగతి బాధితులకు ఈ చికిత్సలు భారమవుతున్నాయి. ఉస్మానియా ఆస్పత్రిలో కాలేయం, మూత్రపిండాల మార్పిడి చికిత్సలు నిర్వహిస్తున్నా ఆశించిన స్థాయిలో బాధితులు అవసరాలు తీర్చలేకపోతున్నాయి. లైవ్ డోనర్ చికిత్సలు చేసేందుకు అవసరమైన మౌలిక సదుయాపాలు లేకపోవడంతో ప్రస్తుతం ఈ రెండు ఆస్పత్రుల్లోనూ కెడావర్ ట్రాన్స్ప్లాంటేషన్లు మాత్రమే జరుగుతున్నాయి. అవయవ మార్పిడి చికిత్సలు చేసేందుకు వైద్యులు రెడీగా ఉన్నప్పటికీ... మౌలిక సదుపాయాల లేమీ, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు లేకపోవడంతో అనేక మంది బాధితులు చికిత్సలకు నోచుకోకుండా మరణిస్తున్నారు. ఇదిలా ఉంటే నిమ్స్ జీవన్‌దాన్‌లో ఇప్పటికే 2,851 మంది కిడ్నీ మార్పిడి కోసం... 2,316 మంది కాలేయం మార్పిడి కోసం పేర్లు నమోదు చేసుకొని, ఆయా ఆస్పత్రుల్లో చికిత్సల కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో చాలామంది నిరుపేదలు ఉన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్సలకు భారీగా ఖర్చవుతుండడంతో.. ఆ మేరకు భరించే స్థోమత లేక చాలామంది మృత్యువాతపడుతున్న సంఘటనలు లేకపోలేదు. గాంధీ ఆస్పత్రిని అవయవ మార్పిడి చికిత్సలకు నోడల్ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఇక్కడ జరుగుతున్న చికిత్సలను జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో లైవ్‌లో వీక్షించే సదుపాయాలు కల్పించనున్నారు. అన్ని విభాగాలకు అనుగుణంగా... అత్యాధునిక క్యాజ్వల్టి, ఐసీయూ ఆధునికీకరణ, మెరుగైన వైద్య సేవలు అందిస్తుండటంతో గాంధీ ఆస్పత్రికి రోగులు పోటెత్తుతున్నారు. 1,062 పడకల సామర్థ్యమున్న గాంధీ ఓపీకి రోజుకు సగటున మూడు వేలకు పైగా బాధితులు వస్తుంటారు. మరో 2,200 మందికి పైగా ఇన్పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఆసుపత్రిలో ఉన్న చికిత్స కేంద్రాలకు భిన్నంగా, అన్ని విభాగాలు వాటిని ఉపయోగించుకునేలా నూతన ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఉదాహరణకు గుండె మార్పిడి చికిత్స చేయాలనుకుంటే అందుకు సంబంధించిన వైద్య నిపుణులు, తర్ఫీదు పొందిన నర్సులు, ఇతర సిబ్బంది పాల్గొంటారు. అనంతరం వెంటనే కాలేయ మార్పిడి చికిత్స అదే కేంద్రంలో చేయాల్సి వస్తే ఆ విభాగానికి సంబంధించిన వైద్యులు, సిబ్బంది తక్షణమే అందుబాటులో ఉండేలా విధివిధానాలు రూపొందిస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేయనున్న ఈ థియేటర్లకు బ్యాక్టీరియాను కూడా దరిచేరనీయరు. అంతేకాదు ఈ కేంద్రాల్లో పనిచేసే వైద్యులు మొదలుకొని వార్డుబాయ్ వరకు అనుభవం ఉన్న వారినే నియమించనున్నారు. గతంలో 65 పడకల ఐసీయూ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం సిబ్బంది లేని కారణంగా సేవలందించేందుకు నెల రోజులు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడలాంటి అవకాశం ఇవ్వకుండా చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న సమయంలోనే అవసరమైన వైద్య సిబ్బంది నియమించనున్నట్లు వైద్యారోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. -
శశికళ భర్తకు అవయవదానం వెనుక ఏం జరిగింది?
సాక్షి, చెన్నై: జైలుపాలైన శశికళ భర్త ఎం నటరాజన్‌కు బుధవారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో అవయవమార్పిడి ఆపరేషన్ జరిగింది. 74 ఏళ్ల నటరాజన్‌కు ప్రాణాలను రక్షించే ఎంతో కీలకమైన కిడ్నీ, లివర్ టాన్స్ప్లాంట్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. అయితే, ఆయనకు అవయవదానం చేసిన తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ టీనేజ్ యువకుడి దేహాన్ని బెయిన్‌డెడ్ స్థితిలో విమానంలో చెన్నైకి తరలించి.. నటరాజన్‌కు అవయవదానం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఆపరేషన్ నిర్వహించిన గ్లెనీగ్లెస్ గ్లోబల్ హెల్త్ సిటీ హాస్పిటల్ తోసిపుచ్చింది. అవయవ మార్పిడి ఆపరేషన్ కోసం నటరాజన్ గత నెల గ్లోబల్ ఆస్పత్రిలో చేరారు. ఇటీవల అన్నాడీఎంకే అధినేత్రి బాధ్యతల నుంచి ఉద్వాసనకు గురైన శశికళ భర్త నటరాజన్‌కు చాలాకాలంగా దూరం ఉంటున్న సంగతి తెలిసిందే. శనివారం రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 19 ఏళ్ల కార్తీక్ అనే యువకుడి అవయవాలను నటరాజన్‌కు సమకూర్చారు. కార్తీక్ బ్రెయిన్ డెడ్ స్థితిలో ఉండగా అతన్ని చెన్నైకి తరలించినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలను ఆస్పత్రి తిరస్కరించింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చిన అనంతరం.. అతను బ్రెయిన్ డెడ్ అయ్యాడని ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, వైద్య సలహాకు వ్యతిరేకంగా కార్తీక్‌ను చెన్నైకి కుటుంబసభ్యులు తరలించారని పేర్కొంది. అయితే, తీవ్రంగా గాయపడిన అతన్ని విమానంలో తరలించారా? లేక ఎలా తీసుకువచ్చారా? అనే విషయాన్ని ఆస్పత్రి వెల్లడించలేదు. అంతేకాదు నిబంధనలకు వ్యతిరేకంగా వీఐపీ కావడంతో నటరాజన్‌కు అవయవదానం ప్రక్రియను చేపట్టినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, అవయవ దానం స్వీకరించే 'వెయిటింగ్ లిస్ట్'లో నటరాజన్ టాప్‌స్థానంలో ఉన్నారని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఆయనకు అవయవ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించామని ఆస్పత్రి తెలిపింది. -
అవయువ దానంపై చట్టం క్లిష్టతరమే: రవిశంకర్
న్యూఢిల్లీ: అవయువ దానాన్ని ప్రోత్సహిస్తూ చట్టం చేయుడం క్లిష్టతరమైన వ్యవహారమని, అవయువ మార్పిడిపై చట్టవిరుద్ధమైన వ్యవహారాలు చోటుచేసుకుంటున్నందున చట్టం చేయుడం సంక్లిష్టమేనని కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం చెప్పారు. అవయువ దానాన్ని ప్రోత్సహించే చట్టం ఎలా చేయూలి? అన్నవి తనను తొలిచివేస్తున్న అంశమని రవిశంకర్ అన్నారు. దేశంలో విజయవంతమైన తొలి కాలేయ మార్పిడి చికిత్స జరిగి 15 ఏళ్లరుున నేపథ్యంలో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో జరిగిన సంస్మరణ స్టాంపు విడుదల కార్యక్రమంలో అపోలో ఆసుపత్రుల గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి చేసిన ప్రతిపాదనకు స్పందనగా రవిశంకర్ ప్రసాద్ ఈ వ్యాఖ్య చేశారు. కాగా, దేశంలో విజయువంతమైన తొలి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స 1998 మేనెల 15వ తేదీన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలోనే జరిగిందని ఆసుపత్రి మెడికల్ డెరైక్టర్ అనుపమ్ సిబల్ చెప్పారు.