కాషాయానికి దూరం అంటున్న కమల్
రాజకీయ అరంగేట్రంపై స్పష్టమైన సంకేతాలు పంపిన కమల్ హాసన్ తాజాగా వామపక్ష నేతలను హీరోలుగా అభివర్ణించారు.
తిరువనంతపురం: రాజకీయ అరంగేట్రంపై స్పష్టమైన సంకేతాలు పంపిన కమల్ హాసన్ తాజాగా వామపక్ష నేతలను హీరోలుగా అభివర్ణించారు. కామ్రేడ్లపై పొగడ్తల వర్షం కురిపిస్తూ కాషాయానికి తాను దూరమని తేల్చిచెప్పారు. శుక్రవారం కేరళ సీఎం పినరయి విజయన్‌ను కలిసిన అనంతరం కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నలభైఏళ్లుగా సినిమాలో నా వేషభాషలు, హావభావాలు చూశారు...ఇవన్నీ నేను కాషాయానికి దూరమన్నది తేటతెల్లం చేస్తా’ యన్నారు.
వామపక్షాలతో కలిసి పనిచేస్తారా అన్న ప్రశ్నకు వేచిచూడండని బదులిచ్చారు. విజయన్‌తో కమల్ రాజకీయ అంశాలపై మంతనాలు జరిపినా చర్చల సారాంశాన్ని వెల్లడించేందుకు ఇరువురు నిరాకరించారు. కమల్ తమను స్నేహపూర్వకంగా కలిశారని, రాజకీయాలు కూడా చర్చకు వచ్చాయని భేటీ అనంతరం విజయన్ తెలిపారు.