డుమ్మా మాస్టర్లు సచిన్, రేఖ

Sachin And Rekha Rajyasabha Report Cards Out - Sakshi

ఈ నెలాఖరులో రాజ్యసభ నుంచి పదవీ విరమణ

సెలెబ్రిటీలకు పదవులెందుకు?

సాక్షి, హైదరాబాద్‌ : ఒకరు క్రికెట్‌ రంగానికే దేవుడు.. మరొకరు బాలీవుడ్‌ ఎవర్‌గ్రీన్‌.. తమ రంగాల్లో అత్యంత ప్రతిభావంతులు. ప్రజల మనసు దోచుకున్న వారు.. కోట్లాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. కానీ, ప్రజాప్రతినిధులుగా వారి పనితీరు మాత్రం అధ్వానంగా ఉంది. వాళ్ల ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ చూస్తే ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే! సచిన్‌ టెండూల్కర్, రేఖ ఇద్దరూ 2012 మార్చిలో పెద్దల సభలో అడుగు పెట్టారు.

ఈ నెలాఖరుకి పదవీ విరమణ చేయబోతున్నారు. రాజ్యసభ అందించిన వివరాల ప్రకారం ఈ ఆరేళ్లలో సచిన్‌ హాజరు 7.3 శాతం మాత్రమే.. 22 ప్రశ్నలు అడిగారు. ఒక్క బిల్లు కూడా ప్రవేశపెట్టలేదు. ఇక రేఖ విషయానికొస్తే ఆమె హాజరు మరీ అన్యాయంగా 4.5 శాతం ఉంది..పెద్దల సభలో అడుగు పెట్టిన దగ్గర్నుంచి ఏ ఒక్క సెషన్‌ని తీసుకున్నా ఒక్క రోజుకు మించి రేఖ హాజరు కాలేదు. అంతే కాదు సభలో అసలు నోరు విప్పలేదు.

వీరిద్దరి పనితీరుపై విమర్శలు రావడం ఇది కొత్తేమీ కాదు. గత ఏడాది సమాజ్‌ వాదీ పార్టీ ఎంపీ నరేష్‌ అగర్వాల్‌ సెలబ్రిటీ ఎంపీల హాజరు అంశాన్ని సభలోనే ప్రశ్నించారు. అప్పుడే సెలెబ్రిటీలకు ఈ రాజకీయ పదవులెందుకన్న చర్చ విస్తతంగా జరిగింది. ఎంపీ పదవులు చేపట్టిన మొదటి రెండేళ్లలో సచిన్, రేఖ ఇద్దరూ ఎంపీ లాడ్స్‌ ని«ధులు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదన్న విషయమూ బయటపడింది.. ప్రతీ రాజ్యసభ సభ్యుడికి ఏడాదికి ఎంపీ ల్యాడ్స్‌ కింద రూ.5 కోట్ల నిధులు ఇస్తారు.. ఆ నిధుల్ని మురగబెట్టారే తప్ప ఖర్చు చేయలేదు.

విమర్శలు వెల్లువెత్తాక వాళ్లలో కదలిక వచ్చింది. సచిన్‌ టెండూల్కర్‌ నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగ, మహారాష్ట్రలోని డోంజా అనే గ్రామాలను దత్తత తీసుకున్నారు. రేఖ కూడా ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి పుణెలోని కసర్‌వాడి దగ్గర ఛత్రపతి సాహు మహరాజ్‌ స్కూల్‌ నిర్మాణానికి రూ.3.03 కోట్లు కేటాయించారు. రాయ్‌బరేలిలో ఒక స్కూలు నిర్మాణానికి కూడా రూ.2.5 కోట్లు ఇచ్చారు.. కానీ, ఆ ప్రాజెక్టుల అతీగతీ ఇప్పటికీ తెలీదు. సచిన్‌ టెండూల్కర్, రేఖలను 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం నామినేట్‌ చేసింది. ఇలా వివిధ రంగాలకు చెందిన నామినేటెడ్‌ ఎంపీల వల్ల ఒరిగేదేమిటన్న విమర్శలు ఘాటుగానే వినిపిస్తున్నాయి.   

సచిన్‌ రిపోర్ట్‌ కార్డు (2012 ఏప్రిల్‌ నుంచి)
సభ జరిగిన రోజులు: 397
సచిన్‌ హాజరైన రోజులు: 29
ఆరేళ్లలో అందుకున్న జీతభత్యాలు: రూ.86,23,266
అడిగిన ప్రశ్నలు: 22
ప్రవేశపెట్టిన బిల్లులు: 0

రేఖ రిపోర్ట్‌ కార్డు (2012 ఏప్రిల్‌ నుంచి)
సభ జరిగిన రోజులు : 397
రేఖ హాజరైన రోజులు : 18
అందుకున్న జీత భత్యాలు : రూ.99,59,178
అడిగిన ప్రశ్నలు: 0
ప్రవేశపెట్టిన బిల్లులు: 0

 – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top