పోలవరం : బయటపడ్డ చంద్రబాబు వ్యవహారం

RS 2346 Crores Additional Payment Pay To Polavaram Contractors - Sakshi

పోలవరం కాంట్రాక్టర్లకు రూ. 2,346 కోట్లు అదనపు చెల్లింపులు

రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు జలశక్తి మంత్రి జవాబు

సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం కాంట్రాక్ట్‌లో చంద్రబాబు వ్యవహారం బయటపడింది. చంద్రబాబు హయంలో పోలవరం కాంట్రాక్టర్లకు భారీగా అదనపు చెల్లింపులు చేశారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయంలో పోలవరం ప్రాజెక్టుకు ఏకంగా రూ.2346కోట్లను అదనంగా చెల్లించినట్లు కేంద్ర జలశక్తి మంత్రి రతన్‌ లాల్‌ కటారియా వెల్లడించారు.రాజ్యసభలో సోమవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా జవాబిస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు.

పోలవరం ప్రాజెక్ట్‌ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపుల వ్యవహారంపై నియమించిన నిపుణుల సంఘం దీనిపై విచారణ జరిపి జూలై 2019లో నివేదికను కేంద్ర జల సంఘానికి తెలిపినట్లు ఆయన చెప్పారు. ఈ నివేదిక ప్రకారం 2015-16 సంవత్సరంలో ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివిధ పనుల నిమిత్తం కాంట్రాక్టర్లతో కుదిరిన ఒప్పందాల పునఃపరిశీలన జరిపి కాంట్రాక్టర్లకు అదనంగా 1331 కోట్లు చెల్లించింది. మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లపై వడ్డీ కింద 84.43 కోట్లు, అడ్వాన్స్ కింద 144.22 కోట్లు, జల విద్యుత్ కేంద్రం ప్రాజెక్ట్ పనులు అప్పగించడానికి ముందుగానే సంబంధిత కాంట్రాక్టర్‌కు అడ్వాన్స్‌ కింద 787 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినట్లుగా నిపుణుల కమిటీ నివేదిక పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు.

అయితే అదనపు చెల్లింపులపై నిపుణుల సంఘం వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రాధమికమైనవని గత నవంబర్‌ 11న రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖలో స్పష్టం చేసినట్లు చెప్పారు. పైన తెలిపిన నిర్ణయాలలో విధానపరమైన అతిక్రమలు లేవని, సంబంధిత అధికారుల ఆమోదం పొందిన తర్వాతే అదనపు చెల్లింపులు జరిగినట్లుగా లేఖలో పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు. ఈ అదనపు చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం విచారణ నివేదిక అందిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం జరుగుతుందని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top