మనీతో మార్కులు

Revaluation scam rocks Anna University - Sakshi

రీవాల్యుయేషన్‌ పేరుతో రూ.240 కోట్ల వసూళ్లు

అన్నా యూనివర్సిటీలో ఆరేళ్లుగా అక్రమాలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నైలోని అన్నా యూనివర్సిటీ అధికారులు డబ్బులకు కక్కుర్తిపడ్డారు.  డబ్బులు ఇచ్చిన విద్యార్థులకు మార్కులు వేసి పాస్‌ చేశారు. ఇలా ఏళ్లుగా సాగుతున్న ఈ దందా మెరిట్‌ విద్యార్థుల ఫిర్యాదుతో బయటపడింది. అధికారులు వసూలు చేసిన మొత్తం రూ.240 కోట్లు ఉంటుందని దర్యాప్తులో తేలింది. ఇంజినీరింగ్, మెడికల్‌ తదితర ప్రధాన కోర్సులు చదివే విద్యార్థులు సెమిస్టర్‌ పరీక్షల్లో ఫెయిలైనా, ఆశించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చినా పునః మూల్యాంకనం (రీవాల్యుయేషన్‌) కోసం దరఖాస్తు చేస్తారు. గత ఏడాది 12 లక్షల మంది సెమిస్టర్‌ పరీక్షలు రాశారు. వారిలో 3,02,380 మంది రీవాల్యుయేషన్‌కి దరఖాస్తు చేశారు. రీవాల్యుయేషన్‌ చేపట్టిన అధికారులు అదనంగా 73,733 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టు ప్రకటన విడుదల చేశారు.

దీంతోపాటు 16,630 మందికి అదనపు మార్కులొచ్చాయి. మొత్తంగా 90,369 మంది లబ్ధి పొందారు. ఈ విషయమై పలువురు విద్యార్థులు అవినీతినిరోధకశాఖకు ఫిర్యాదు చేశారు. ముడుపులు అందుకుని అదనపు మార్కులు వేస్తున్నట్లు కొందరు దళారుల ద్వారా తెలుసుకున్న విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో ఏసీబీ అధికారులు రహస్య విచారణ చేపట్టగా వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తేలింది. ఈ దందా 2011 నుంచి జరుగుతున్నట్లు గుర్తించారు. 2011–16కాలంలో దాదాపు 12 లక్షల మంది రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా 5 లక్షలమందికి అదనపు మార్కులొచ్చాయి. ఈ ఐదు లక్షల మందిలో ఎంత మంది విద్యార్థులు లంచాలు ఇచ్చి లబ్ధి పొంది ఉంటారని ఆరాతీస్తున్నారు.

ఒక్కో సెమిస్టర్‌కు రూ.45 కోట్ల వరకు విద్యార్థుల నుంచి అధికారులు వసూలు చేసినట్లు తేలింది. మార్కుల పునఃపరిశీలన పేరుతో గత మూడేళ్లలో ఆరు సెమిస్టర్లకుగాను దాదాపు రూ.240 కోట్లు స్వాహా చేసినట్లు భావిస్తున్నారు. దీంతో అవినీతి నిరోధకశాఖ, విజిలెన్స్‌ శాఖలో ప్రత్యేక విభాగానికి చెందిన అధికారులు అన్నా యూనివర్సిటిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి 2015–18 మధ్యకాలంలో ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌గా వ్యవహరించిన ఉమ సహా పదిమందిపై కేసులు పెట్టారు. ఆరోపణలు ఎదుర్కొన్న ప్రొఫెసర్లు, వర్సిటీ అధికారుల ఇళ్లలో తనిఖీలు చేయగా అదనపు మార్కుల అక్రమాలకు సంబంధించిన ఆధారాలు, స్థిరాస్తుల పత్రాలు లభించాయి. మరిన్ని ఆధారాలను వర్సిటీ అధికారులు ధ్వంసం చేసినట్లు కూడా విచారణలో వెల్లడైంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top