ఆగస్టులోగా అంతర్జాతీయ విమానాలు!

Resume international flights before August - Sakshi

పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ  

న్యూఢిల్లీ:   ఇండియాలో ఆగస్టు లేదా సెప్టెంబర్‌ కంటే ముందే అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ శనివారం చెప్పారు. మే 25వ తేదీ నుంచి దేశీయ విమానాల సేవలను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని రాష్ట్రాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికీ పెరుగుతుండడంతో విమానాల రాకపోకలకు ఇప్పట్లో అనుమతి ఇవ్వొద్దని కోరుతున్నాయి.

విమానాల్లో ప్రయాణించేవారు మొబైల్‌ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్‌ కలిగి ఉండడం తప్పనిసరి కాదని హర్దీప్‌సింగ్‌ పురీ చెప్పారు. దాని బదులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, తమకు ఈ వైరస్‌ సోకలేదంటూ సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రం ఇస్తే సరిపోతుందని వెల్లడించారు. దేశీయ విమానాల్లో వచ్చేవారి ఆరోగ్యసేతు యాప్‌లో గ్రీన్‌ స్టేటస్‌ చూపిస్తే వారిని క్వారంటైన్‌లో ఉంచాల్సిన అవసరం లేదని చెప్పారు.  వందే భారత్‌ మిషన్‌ కింద ఈ నెలాఖరు నాటికి విదేశాల నుంచి 50 వేల మంది భారతీయులను వెనక్కి తీసుకొస్తామని తెలిపారు. మే 7 నుంచి మే 21వ తేదీ మధ్య 23 వేల మందిని ప్రత్యేక విమానాల ద్వారా వెనక్కి తీసుకొచ్చారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top