
రామ్‌జెఠ్మలానీ
తనకు ఐదు నిమిషాలు అవకాశం ఇస్తే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై వచ్చిన ఆరోపణలన్నీ సత్యదూరాలని నిరూపించగలనని ప్రముఖ న్యాయవాది రామ్‌జెఠ్మలానీ కోర్టుకు విన్నవించారు.
బెంగళూరు : తనకు ఐదు నిమిషాలు అవకాశం ఇస్తే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై వచ్చిన ఆరోపణలన్నీ సత్యదూరాలని నిరూపించగలనని ప్రముఖ న్యాయవాది రామ్‌జెఠ్మలానీ కోర్టుకు విన్నవించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు రుజువు కావడంతో జయలలితకు ఇక్కడి సీబీఐ ప్రత్యేక కోర్టు గత శనివారం నాలుగేళ్ల జైలు శిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో ఉన్న జయ తరఫున ప్రముఖ న్యాయవాది రామ్‌జెఠ్మలానీ వాదించనున్నారు. హైకోర్టుకు ప్రస్తుతం దసరా సెలవులు కావడంతో మంగళవారం ఉదయం వెకేషన్ బెంచ్ జడ్జి రత్న కళ ఎదుట ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించనందున, విచారణను అక్టోబరు ఆరో తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఆ రోజు కూడా వాల్మీకి జయంతి సందర్భంగా కర్ణాటకలో సెలవు. అయితే కేసు విచారణను ఈరోజే (మంగళవారం) చేపట్టాలని, దీని కోసం తాను లండన్ నుంచి వచ్చానని రామ్‌జెఠ్మలానీ వాదించారు.
తనకు ఐదు నిమిషాలు అవకాశం ఇస్తే జయలలితపై వచ్చిన ఆరోపణలన్నీ సత్యదూరాలని నిరూపించగలనని విన్నవించారు. కనీసం బుధవారం అయినా విచారణకు అనుమతించాలని ఆయన కోరారు. కోర్టుకు దసరా సెలవులు కనుక విచారణ సాధ్యం కాదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. పైగా ఇదివరకే విచారణను వాయిదా వేసేసినందున, హైకోర్టు రిజిస్ట్రార్ను కలవాల్సిందిగా ఆయనకు న్యాయమూర్తి సూచించారు. అనంతరం రామ్‌జెఠ్మలానీ సూచన మేరకు ఆయన సహాయకులు రిజిస్ట్రార్ను కలిశారు. కేసు విచారణకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తి డీహెచ్. వఘేలా సూచన మేరకు ప్రత్యేక ధర్మాసనం బుధవారం విచారణ చేపడుతుందని ఆదేశాలు వెలువడ్డాయి.
**