తాటాకు రాఖీలతో వేడుకలు

Rakhi With Palm Tree Leaf  - Sakshi

మల్కన్‌గిరి : జిల్లాలోని కలిమెల సమితి సీక్‌పల్లి పంచాయతీకి చెందిన గోరకుంట గ్రామ పాఠశాల విద్యార్థులు వినూత్నంగా తాటాకు రాఖీలు వినియోగించి పలువురిని ఆకర్షించారు. కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్‌ రాఖీలకు బదులుగా తాటి ఆకుతో తయారు చేసిన రాఖీలు వాడి రాఖీ పౌర్ణమి సందర్భంగా తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ సందర్భంగా తమ తోటి విద్యార్థులు, సోదరులకు తాటాకు రాఖీలు కట్టారు. అలాగే చిత్రకొండ సమితిలోని సరస్వతీ విద్యామందిర్‌ విద్యార్థులు 18వ బెటాలియన్‌కు చెందిన బీఎస్‌ఎఫ్‌ జవానులకు రాఖీలు కట్టారు. కమాండెంట్‌ అమరేస్‌కుమార్‌ రాఖీ కట్టిన విద్యార్థులకు స్కూల్‌ బ్యాగులను గిఫ్ట్‌లుగా అందజేశారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 

బరంపురంలో...

బరంపురం : స్థానిక గిరి రోడ్‌లో ప్రజాపతి బ్రహ్మకుమారి ఈశ్వరీయా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాలయానికి చెందిన బ్రహ్మకుమారీలు మంజు, మాల పలువురికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా బరంపురం సర్కిల్‌ జైల్లో ఉన్న జీవిత ఖైదీలకు తమ సోదరీమణులు రాఖీలు కట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

పర్లాకిమిడిలో..

పర్లాకిమిడి : పట్టణంలో ప్రతి ఇంట రక్షాబంధన్‌(రాఖీ పౌర్ణమి) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సోదరీమణులందరూ తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి, తమ ఆత్మీయతను చాటుకున్నారు. పట్టణంలోని పలు వీధుల్లో కొందరు మగవారు కొత్త జంధ్యాలను ధరించారు. అనంతరం పట్టణంలోని జంగం, సేరి వీధుల్లో సాంప్రదాయ సిద్ధమైన గుమ్మను ఏర్పాటు చేసి, గుమ్మ గెంతాటలో యువకులు పోటీ పడ్డారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా పావుతులం బంగారం, మిగతా వారికి వివిధ గృహోపకరణాలను అందజేశారు. 
 

   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top