
సాక్షి ప్రతినిధి, చెన్నై: సినీ నటుడు రజనీకాంత్ రాజకీయ పార్టీ చిహ్నంగా తామరపువ్వు అందులో బాబా ముద్రతో కూడిన చేయి గుర్తును పెడతారని అందరూ భావిస్తుండగా అకస్మాత్తుగా మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. రజనీ రాజకీయ ప్రవేశం వెనుక బీజేపీ హస్తం ఉందని కొందరు ప్రచారం చేస్తుండటంతో తామరపువ్వును తొలగించి బాబా ముద్ర చుట్టూ ఒక పామును చేర్చిన బొమ్మ తాజాగా ప్రచారంలోకి వచ్చింది. అయితే పార్టీ పేరును, చిహ్నాన్ని ఎప్పుడు ప్రకటిస్తారని విలేకరులు రజనీని అడగ్గా ఆ విషయం తనకే తెలీదన్నారు.
చారిత్రక తమిళనాడులో రాజకీయ విప్లవం తీసుకురావాలనేది తన ఆశయమనీ, భావి తరాల కోసం చేస్తున్న ప్రజాస్వామ్య పోరాటం తనదని రజనీ చెప్పారు. 234 నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని ఇప్పటికే ప్రకటించిన రజనీ...ఒక్కో నియోజకవర్గం నుంచి తొలుత ముగ్గురిని ఎంపిక చేసి వారిలో ఒకరికి టికెట్ కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల్లో కనీసం రూ. కోటి ఖర్చు భరించగలిగే వ్యక్తిని అభ్యర్థిగా ఉంచాలని ఆయన భావిస్తున్నారట. రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్న ఇద్దరు ప్రముఖ తమిళ కథానాయకులు రజనీకాంత్, కమల్ హాసన్ ఈ నెల 6న మలేసియాలో భేటీ అయ్యే అవకాశం ఉంది. అక్కడ జరిగే ఓ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరుకానున్నారు.