అతివృష్టి–అనావృష్టి

Rain Shortfall In North East India - Sakshi

వర్షాల కోసం ఈశాన్య రాష్ట్రాల ఎదురుచూపు

కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. వరదలు ముంచెత్తడంతో కేరళ విలవిలలాడుతోంది. సాయం కోసం ఎదురుచూస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇలా ఉంటే ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఈ సీజన్‌లో అత్యధిక వర్షాలు, వరదలతో సతమతమయ్యే ఈశాన్య రాష్ట్రాల్లో ఈసారి కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో మేఘాలయా, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మణిపూర్‌ రాష్ట్రాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రాల్లో వర్షాలు లేకపోవడంతో మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

కనీస స్థాయీ కరువే
అస్సాంను వర్షాకాలంలో ఏటా వరదలు ముంచెత్తుతాయి. అయితే, ఈ ఏడాది ఆగస్టు 18 వరకు 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అస్సాంలో సాధారణ వర్షపాతం 1088.5 మిల్లిమీటర్లు. ఇప్పటివరకు కురిసింది 759.3 మి.మీ. మాత్రమేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మణిపూర్‌లో 66 శాతం, అరుణాచల్‌ప్రదేశ్‌లో 46 శాతం, మేఘాలయాలో 43 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నాగాలాండ్, త్రిపుర, మిజోరంలో 28 శాతం, 23 శాతం, 10 శాతం తక్కువగా నమోదయ్యాయి. అత్యధిక వర్షపాతం కల్గిన మేఘాలయాలోని ఈస్ట్‌ కాశీ హిల్స్‌ జిల్లాల్లోని మాసిన్రం, సోహ్రాల్లో ఈ సీజన్‌లో 28 శాతం తక్కువ వర్షపాతం నమోదు అవ్వడం గమనార్హం.

తేమశాతం తగ్గిపోవడం వల్లే..
నైరుతీ రుతుపవనాల కాలంలో ఈశాన్య ప్రాంతంలో వీస్తున్న గాలుల్లో తేమ శాతం తక్కువగా ఉంటోంది. పశ్చిమ బంగాళాఖాతంలో తరుచుగా ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా పశ్చిమం నుంచి దక్షిణ దిశగా గాలులు వీయడంతో తేమ శాతం తగ్గిపోతోందని ప్రాంతీయ వాతావరణ శాఖకు చెందిన ఓ శాస్త్రవేత్త వెల్లడించారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల కారణంగానే ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపారు.  

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు తక్కువగా కురవడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎగువ అస్సాంలోని నార్త్‌ లక్ష్మిపూర్‌లో రెండు రోజుల క్రితం 38.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రీజియన్‌లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఇక్కడ సాధారణం కంటే 6.2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. తేమతో కూడిన మేఘాలు లేకపోవడమే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని ప్రాంతీయ వాతావరణశాఖ శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. నైరుతీ రుతుపవనాలు జూన్‌ 1న ప్రారంభమై సెప్టెంబర్‌ 30 వరకు ఉంటుందని కావున సీజన్‌ ఇంకా ముగియలేదని, అయితే ఈసారి సాధారణం కంటే తక్కువగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top