పంజాబ్‌ మెయిల్‌ 107 డెక్కన్‌ క్వీన్‌ 90

Punjab Mail completes 107 years, Deccan Queen turns 89 - Sakshi

ముంబై: మన దేశంలోనే అత్యంత దూరం నడిచే ఆ పాత రైలు బండి పంజాబ్‌ మెయిల్‌. ఆ రైలు జూన్‌ 1తో 107 ఏళ్లను పూర్తి చేసుకుంది. ముంబై నుంచి పుణెకు నడిచే డెక్కన్‌ క్వీన్‌ 89 ఏళ్లు పూర్తి చేసుకుంది. పంజాబ్‌ మెయిల్‌ ఆవిరితో నడిచే రైలు. ముంబై నుంచి పెషావర్‌ (ప్రస్తుతం పాక్‌లో ఉంది) వరకు నడిచింది. ఈ రైలు సర్వీసు మొదట్లో బ్రిటిషర్ల కోసమే ఉండేది. తర్వాత దిగువ తరగతి వారికీ అందుబాటులోకొచ్చింది. 1930లో ఈ రైలుకి మూడో తరగతి బోగీలను అమర్చారు. 1945లో ఏసీ సౌకర్యం వచ్చింది.

ప్రస్తుతం ఈ రైలు విద్యుత్‌పైనే నడుస్తోంది. దేశ విభజనకు ముందు పంజాబ్‌ మెయిల్‌ ముంబై నుంచి పెషావర్‌ వరకు 2,496 కి.మీ. దూరం 47 గంటల్లో వెళ్లేదని సెంట్రల్‌ రైల్వేకు చెందిన చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ అధికారి సునీల్‌ చెప్పారు. బ్రిటీష్‌ ఇండియాలో అత్యంత వేగంతో ప్రయాణించే రైలు ఇదే. ప్రస్తుతం ఈ రైలు ఫిరోజ్‌పూర్‌ వరకు నడుస్తోంది. అప్పట్లోనే పంజాబ్‌ మెయిల్లో బాత్‌రూమ్, రెస్టారెంట్‌ కార్, లగేజ్‌ పెట్టుకోవడానికి  కంపార్ట్‌మెంట్‌ ఉండేవి.

ఆరు బోగీలు ఉండే మెయిల్‌లో 3 ప్రయాణికుల కోసం కేటాయిస్తే మిగతావి ఉత్తరాల రవాణాకు వాడారు. ఈ 3 బోగీల్లో కేవలం 96 మంది ప్రయాణించే వీలుండేది. ఇక డెక్కన్‌ క్వీన్‌ రైలు 1930జనవరి 1న ప్రారంభమైంది. పుణె నుంచి ముంబై వరకు నడిచిన ఈ రైలు దేశంలో తొలి డీలక్స్‌ రైలు.  ఈ డెక్కన్‌ క్వీన్‌ ఠంచనుగా షెడ్యూల్‌ టైమ్‌కు నడిచేది. అందుకే ఈ రైల్లో ప్రయాణించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించేవారని సునీల్‌ వివరించారు.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top