న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు... పోల్‌వాల్ట్‌లో జాతీయ రికార్డు నెలకొలి్పన అథ్లెట్‌కు రైల్వే స్టేషన్‌లో అవమానం జరిగింది. టోర్నమెంట్‌లో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో క్రీడా సామగ్రితో కలిసి రైలులో ప్రయణించినందుకు గానూ జరిమానా కట్టాల్సి వచ్చింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని పన్వేల్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకోగా... సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే శాఖ స్పందించింది. అసలేం జరిగిందంటే... మంగళూరు వేదికగా జరిగిన ఆలిండియా యూనివర్సిటీ చాంపియన్‌షిప్‌లో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో జాతీయ రికార్డు హోల్డర్ దేవ్ కుమార్ మీనాతో పాటు అతడి కోచ్ ఘన్‌శ్యామ్‌కు రైల్వే స్టేషన్‌లో వింత సమస్య ఎదురైంది.
మంగళూరు నుంచి వస్తున్న సమయంలో ప్లేయర్లంతా తమ ‘పోల్’లను ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రైలులోని ఫ్యాన్‌ల పైభాగంలో ఉంచారు. అయితే ఇది గమనించిన ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)... ‘పోల్’లను ఇలా తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధమని వారిని రైలు నుంచి దింపాడు. రూ. 8 వేల జరిమానా కట్టాల్సిందేనని... లేకుంటే పోల్స్ తిరిగి ఇవ్వడం జరగదని హెచ్చరించాడు. అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొన్నట్లు వెల్లడించినా... రైల్వే అధికారులు వినలేదు. సుమారు ఐదు గంటల పాటు అథ్లెట్లను మానసిక వేదనకు గురిచేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
‘మేము మంగళూరు నుంచి వస్తున్నాం. పన్వేల్ నుంచి భోపాల్ వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో రైల్వే సిబ్బంది మా క్రీడా సామగ్రిని తొలగించాలని చెప్పారు. అవి పోల్ వాల్ట్స్ అని... మేము టోర్నమెంట్‌లో పాల్గొని వస్తున్నామని వారికి చెప్పాం. అయితే క్రీడా సామాగ్రిని లగేజీ కంపార్ట్‌మెంట్‌లో వేయాలని... ఇలా ప్రయాణికులతో పాటు వాటిని ఉంచకూడదని చెప్పారు. పోల్‌వాల్ట్ కోసం వినియోగించే పోల్స్ ఫైబర్‌తో తయారవుతాయి. వాటి ధర కూడా ఎక్కువే. లగేజీలో వేస్తే విరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే గతంలోనూ వాటిని మాతో పాటే తీసుకొని ప్రయాణించాం. ఎంత చెప్పినా అధికారులు అర్థం చేసుకోలేదు. పెద్ద ఎత్తున జరిమానా కట్టాలని ఒత్తిడి చేశారు. చివరకు దాదాపు 2 వేల రూపాయల జరిమానా అనంతరం మమ్మల్ని వదిలేశారు.
ఇది మమ్మల్ని ఎంతగానో బాధించింది’ అని కోచ్ ఘన్‌శ్యామ్ వెల్లడించారు. దేవ్ కుమార్ మీనా గతేడాది జర్మనీ వేదికగా జరిగిన ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో 5.40 మీటర్ల ఎత్తు దూకి తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలుకొట్టాడు. కాగా రైల్వే శాఖ దీనిపై స్పందిస్తూ... ‘ప్లేయర్ల మనోభావాలు దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు. మేము అథ్లెట్లను గౌరవిస్తాం. ఒక్కో పోల్ 5 మీటర్ల కంటే పొడవు ఉంది. దాని వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పాం’ అని వివరణ ఇచి్చంది. ఇది ఈ ఒక్కసారి ఎదురైన సమస్య కాదని... ప్రయాణ సమయంలో ప్రతీసారి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అథ్లెట్లు వాపోతున్నారు. క్రీడా పరికరాలను తీసుకెళ్లే విషయంలో కచి్చతమైన నియమాలను రూపొందించాలని కోరుతున్నారు.


