వైరల్‌: మీ బిజినెస్‌ కార్డు సూపర్‌!!

Pune Maid Offered Job After Her Business Card Goes Viral - Sakshi

ఈ పోటీ ప్రపంచంలో ఒక్కసారి ఉద్యోగం కోల్పోతే తిరిగి సంపాదించుకోవడం ఎంత కష్టమో మనలో చాలా మందికి అనుభవమే. ఇక నాలుగు ఇళ్లల్లో పనిచేసుకుని జీవనం సాగించే హోం మేడ్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యజమానుల దయాగుణంపైనే వారి ఆదాయం, ‘ఉద్యోగం’ ఆధారపడి ఉంటుంది. కొంతమంది యజమానులు కఠిన వైఖరి ప్రదర్శిస్తూ అతి తక్కువ జీతానికే వారి సేవలు వినియోగించుకోవాలని చూస్తుంటారు. అంతేకాదు పొరపాటున జీతం పెంచమని అడిగితే పనిలో నుంచి తీసివేస్తామని బెదిరిస్తారు. దీంతో అప్పటికప్పుడు వేరే చోట పని దొరక్క.. ఉపాధి దొరికే అవకాశం లేక వాళ్లు విలవిల్లాడతారు. అయితే పూణేకు చెందిన ధనశ్రీ షిండే అనే బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ మాత్రం తన ఇంట్లో పనిచేసే మహిళకు ఇలాంటి పరిస్థితి రానివ్వలేదు. మార్కెటింగ్‌ రంగంలో తనకున్న అనుభవాన్ని ఉపయోగించి ఆమెకు ఓ బిజినెస్‌ కార్డు తయారు చేసి.. ఆమెకు చేతినిండా పనిదొరికేలా చేశారు.

ఈ విషయాన్ని అస్మితా జవదేవకర్‌ అనే నెటిజన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అందులో ఉన్న వివరాల ప్రకారం.. ‘ ధనశ్రీ ఓ రోజు ఇంటికి వచ్చే సమయానికి ఆమె పనిమనిషి గీతా కాలే బాధగా కనిపించింది. ఏమైందని ఆరా తీయగా తన ఉద్యోగం పోయిందని చెప్పింది. తద్వారా తాను నెలకు 4000 రూపాయల ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన చెందింది. అప్పుడు ధనశ్రీకి ఓ ఆలోచన తట్టింది. ‘ అంట్లు తోమడానికి నెలకు రూ. 800, ఇల్లు ఊడ్వటానికి రూ. 800, బట్టలు ఉతకడానికి రూ. 800, రొట్టెలు చేసేందుకు 1000 రూపాయలు. ఇక ఇల్లు శుభ్రం చేయడం, కూరగాయలు తరగడం వంటి సేవలు అదనం. ఆధార్‌ కార్డు కూడా వెరిఫై చేయబడింది’ అంటూ గీతా కాలే పేరిట ఓ బిజినెస్‌ కార్డు రూపొందించింది. ఇప్పుడు వాళ్లకు పదుల సంఖ్యలో ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి. గీతా సేవలను వినియోగించుకునేందుకు బద్వాన్‌ వాసులు ముందుకు వస్తున్నారు’ అని తన అస్మిత తన ఫేస్‌బుక్‌ పేజీలో రాసుకొచ్చారు. కాగా ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటంతో గీతా, ధనశ్రీలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. యజమాని మనసు గెలుచుకున్న గీతా... పనిమనిషి సమస్యను పరిష్కరించిన ధనశ్రీ.. మీరిద్దరూ సూపర్‌. అన్నట్లు మీ బిజినెస్‌ కార్డు కూడా ఎంతో బాగుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top