పీఎఫ్ వాటా చెల్లింపు ఇక ఐచ్ఛికం | Sakshi
Sakshi News home page

పీఎఫ్ వాటా చెల్లింపు ఇక ఐచ్ఛికం

Published Sun, Mar 1 2015 4:51 AM

provident fund for small employees

- చిరుద్యోగులకు వెసులుబాటు
 
న్యూఢిల్లీ: చిరుద్యోగులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. నిర్దిష్ట పరిమితి కంటే తక్కువగా నెలవారీ వేతనం పొందుతున్న కార్మికులు ఇకమీదట ఈపీఎఫ్(ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) కు తమ వంతు పీఎఫ్ వాటాను చెల్లించడం ఐచ్ఛికం కానుంది. అయితే యాజమాన్యాలు మాత్రం ఈ పథకానికి తమ వంతు వాటాను చెల్లించాల్సిందే. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శనివారం తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం ప్రకటించారు. అయితే బడ్జెట్ ప్రతిపాదనల్లో వేతన పరిమితి ఎంతనేది నిర్దిష్టంగా పేర్కొనలేదు. ప్రస్తుతం ఉద్యోగులందరూ బేసిక్ శాలరీ, డీఏతోసహా తమ బేసిక్ వేతనంలో 12 శాతాన్ని పీఎఫ్ వాటాగా చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా యాజమాన్యాలు తమ వంతు వాటాను చెల్లిస్తున్నాయి.
 
ఇదిలా ఉండగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) నిర్వహిస్తున్న ఈపీఎఫ్ పథకం, కొత్త పెన్షన్ పథకం(ఎన్‌పీఎఫ్)లలో ఏదో ఒకదానిని ఎంచుకునే సౌలభ్యం సంఘటితరంగ ఉద్యోగులకు లభించనుంది. అదేవిధంగా ఈఎస్‌ఐ కల్పించే ఆరోగ్య సదుపాయాలు లేదా బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ గుర్తింపు పొందిన ఆరోగ్య బీమాలలో ఏదో ఒకదానిని ఎంచుకునే వెసులుబాటు సైతం వారికి లభించనుంది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని ప్రభుత్వం సవరిస్తుందని జైట్లీ తెలిపారు. ఈపీఎఫ్‌వో సామాజిక భద్రతా పథకాల కింద ప్రస్తుతం ఐదుకోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు.
 
ఈపీఎఫ్, పీపీఎఫ్ ఖాతాల్లో ఎవరూ క్లెయిమ్ చేయని కారణంగా పేరుకుపోయిన రూ.తొమ్మిదివేల కోట్లతో(ఈపీఎఫ్‌లో రూ.6 వేల కోట్లు, పీపీఎఫ్‌లో రూ.3 వేల కోట్లు) వృద్ధుల సంక్షేమం కోసం ఒక నిధిని ఏర్పాటు చేస్తారు. ఈ మొత్తాన్ని వృద్ధాప్య పింఛన్లు పొందేవారు, బీపీఎల్ కార్డుదారులు, చిన్న, సన్నకారు రైతులు, ఇతరు నిమ్నవర్గాలకు చెందినవారికి ప్రీమియం చెల్లింపులకోసం వినియోగిస్తారు.
 
ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు సంబంధించిన చట్టాల్లో సమూల మార్పులను ప్రభుత్వం తీసుకురానుంది. ఇందులో భాగంగా ఉద్యోగులు తమ శాలరీని ఏ విధంగా పొందాలో వారే నిర్ణయించుకోవచ్చు. సంబంధితులందరితో చర్చించిన అనంతరం ఈ చట్టాన్ని సవరించనున్నట్టు జైట్లీ తెలిపారు.

 

Advertisement
Advertisement