రక్షణలో ప్రైవేటు భాగస్వామ్యం | Sakshi
Sakshi News home page

రక్షణలో ప్రైవేటు భాగస్వామ్యం

Published Sun, May 21 2017 3:08 AM

Private partnership in defense

ఖరారుచేసిన రక్షణ శాఖ  

న్యూఢిల్లీ : భారత్‌లోని ప్రైవేట్‌ కంపెనీలు విదేశీ సంస్థల సహకారంతో యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, సైనిక వాహనాలను దేశీయంగా తయారుచేసే విషయమై కేంద్రం రూపొందించిన వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా(ఎస్పీఎం)కు రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి జైట్లీ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) శనివారం ఈ ఒప్పందాన్ని ఖరారుచేసింది. ఆర్థిక శాఖ సమీక్షించాక ఎస్పీఎం కేబినెట్‌ పరిశీలనకు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ జాబితా యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, సైనికవాహనాలకే పరిమితమైనప్పటికీ తదుపరి దశలో మరిన్ని రక్షణ ఉత్పత్తుల్ని చేర్చే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమానికి ఊతమిచ్చేలా..దేశీయంగా రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ఈ నమూనా దోహదపడుతుందని అధికారులు తెలిపారు. భారత కంపెనీలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పారదర్శకంగా, పోటీతత్వంతో పనిచేసేలా నూతన విధానం ఉంటుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవల రక్షణ మంత్రి  జైట్లీతో సమావేశమైన అశోక్‌ లేలాండ్, మహీంద్ర అండ్‌ మహీంద్ర తదితర సంస్థలు ప్రస్తుతమున్న జాబితాలో మరిన్ని రక్షణ ఉత్పత్తులను చేర్చాలన్నాయి. ఒప్పందం ఖరారయ్యాక సదరు సంస్థలపై న్యాయవిచారణ, తనిఖీలకు వీలు కల్పించాలని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement