గ్రామ సర్పంచ్‌లకు ప్రధాని లేఖలు

Prime Minister's Letters to Village Sarpanchs - Sakshi

న్యూఢిల్లీ : వర్షపు నీటిని ఆదా చేయడానికి గ్రామీణ ప్రజలు కృషి చేయాలని  ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన గ్రామ సర్పంచ్‌లకు లేఖలు రాశారు. ‘ప్రియమైన గ్రామ సర్పంచ్‌లకు నమస్కారం. మీరంతా ఆయురారోగ్యాలతో ఉన్నారని ఆశిస్తున్నాను. రాబోయేది వర్షకాలం.‍ వరుణుడు మనకు సరిపడినంతా నీటిని అందించాలని ఆశిస్తున్నా. కాబట్టి మనమంతా దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. వర్షపు నీటిని పరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. గ్రామ సభల్లో సర్పంచ్‌లు వర్షపు నీటిని ఎలా ఒడిసి పట్టుకోవాలన్న అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాల’ని లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా గ్రామస్తులు వర్షపు నీటిని వృథా కాకుండా సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకోడానికి వీలుగా మరిన్ని చెక్‌ డ్యామ్‌లు, చెరువులను నిర్మించాలని మోదీ సూచించారు.

కాగా ప్రధాని సంతకంతో ఉన్న ఈ లేఖలను ఆయా జిల్లాల కలెక్టర్లు వారి పరిధిలోని గ్రామ సర్పంచ్‌లకు అందజేశారు. ఇక ప్రధాని సొంత నియోజకవర్గమైన వారణాసి సమీపంలో ఉన్న సోన్‌భద్రలో 637 గ్రామ సర్పంచ్‌లు ప్రధాని లేఖను అందుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహ జిల్లాలో కలెక్టర్‌ ఉమేశ్‌ మిశ్రా 601 లేఖలను గ్రామాలలో అందజేశారు. ఇక ఈ ప్రాంతంలో 775 చెరువులను తవ్వే ప్రణాళికను రూపొందించి పనులను కలెక్టర్‌ ఇప్పటికే ప్రారంభించారు.

శనివారం నీతి ఆయోగ్‌ మండలి సమావేశం జరుగనున్న నేపథ్యంలో.. వర్షపు నీటి ఆవశ్యకతను వివరిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న గ్రామ సర్పంచ్‌లకు వ్యక్తిగత లేఖలు రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నీతి ఆయోగ్‌ సమావేశంలో కూడా ప్రధాని మోదీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. ఇక దేశవ్యాప్తంగా తాగు, సాగునీటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని ఆదేశాల మేరకు జల శక్తి మంత్రిత్వ శాఖ అంతర్‌ రాష్ట్ర సమావేశాన్ని నిర్వహించి నీటి ఎద్దడి గురించి సమీక్ష నిర్వహించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top