
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ ప్రజలందరూ పవిత్రకార్యంగా భావించి ఓటింగ్‌లో పాల్గొనాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రామ్‌నాథ్ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది రాబోతున్న ఎన్నికలను 21వ శతాబ్దపు భారతదేశాన్ని మలిచే విశిష్ట అవకాశంగా పరగణించాలని ఆయన సూచించారు. ఎన్నికలు అంటే రాజకీయ ప్రక్రియ కాదని, అది ఉమ్మడి విజ్ఞత, ఉమ్మడి కార్యాచరణ అని, ప్రజాస్వామిక స్ఫూర్తి, ఆదర్శాలు ప్రాతిపదికగా రానున్న 17వ లోక్‌సభ కొలువుదీరాలని ఆయన ఆకాంక్షించారు.
దేశంలో మహిళలు, రైతులు సాధికారిత సాధిస్తున్నారని, డిజిటల్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని కోవింద్ పేర్కొన్నారు. జాతీయ వనరులపై అందరికీ హక్కులు ఉన్నాయని గుర్తుచేశారు. నేటి మన నిర్ణయాలే రేపటి భవిష్యత్ భారతానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు.