వయసు చిన్న.. బాధ్యత మిన్న

Poor Girl In Orissa - Sakshi

మల్కన్‌గిరి : పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన వయసుఆ బాలికది. తోటి పిల్లలతో చెంగు చెంగున గెంతుతూ ఆటలాడుకోవాల్సిన పసిప్రాయం ఆమెది. అయితే ఎవ్వరూ దిక్కు లేని ఇంటికి తానే అన్నీ అయి బాధ్యతలు మోస్తూ కుటుంబాన్ని నడిపిస్తోంది.జిల్లాలోని మల్కన్‌గిరి సమితి బోయిళపరి గ్రామానికి చెందిన బాలిక జానకీ దురువ(12) ఇంటి పెద్దై బరువు బాధ్యతలు మోస్తోంది. 
వివరాలిలా ఉన్నాయి.. అదే గ్రామానికి చెందిన సోంబారీ దురువ(83) సామారీ దురువ అనే స్వాతంత్య్ర సమరయోధుడి భార్య.

1940వ సంవత్సరంలో స్వాతంత్య్ర సమరయోధుడు సహిద్‌ లక్ష్మణ్‌నాయక్‌తో పాటు సామారీ దురువ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నాడు. 1942లో మల్కన్‌గిరి జిల్లా మత్తిలి బ్రిటిష్‌ పోలీస్‌స్టేషన్‌పై చేసిన దాడిలో సామారీ దురువ తీవ్ర గాయాలపాలయ్యాడు. 1942 నుంచి 1944 వరకు సహద్‌ లక్ష్మణ్‌నాయక్‌తో పాటు బరంపురం జైల్లో ఉండి వచ్చాడు. అనంతరం గిరిజన పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజుతో పాటు ఎన్నో ఉద్యమాలు, పోరాటాల్లో పాల్గొన్నాడు.

చివరికి స్వాతంత్య్రం వచ్చిన 1947 తర్వాత కొంత కాలానికి ప్రభుత్వం స్వాతంత్య్ర సమరమోధులకు పింఛన్‌లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సామారీ దురువకు కూడా పింఛన్‌ వచ్చేది. దీంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. సామారీ దురువకు ఇద్దరు సంతానం. ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు. కొడుకు పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. కానీ కూతురికి పెళ్లి చేశాడు. ఆమెకు పుట్టిన బిడ్డ జానకీ దురువ. సామారీ దురువకు 2010వ సంవత్సరానికి రూ.3 వేలు పింఛన్‌ వచ్చేది. అనారోగ్య కారణాలతో సామారీ దురువ 2010లో చనిపోయాడు. 

ఢిల్లీ వరకు వెళ్లినా..

తర్వాత సంవత్సరానికే కూతురు, అల్లుడు కూడా చనిపోయారు. వారి బిడ్డయైన జానకీ దురువను అమ్మమ్మ సాంబారీ దురువ పెంచి, పెద్ద చేసింది. ఇప్పుడు ఆమె వృద్ధాప్య దశకు చేరుకోవడంతో ఏ పనీ చేయలేకపోతుండడంతో ఇంటికే పరిమితమయింది. ఇప్పుడు సాంబారీ దురువకు వృద్ధాప్య పింఛన్‌ రూ.300 మాత్రమే వస్తోంది. తన భర్తకు వచ్చే స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్‌ తనకు ఇప్పించాలని కోరుతూ ఎన్నో  ప్రయత్నాలు చేసి ఆఖరికి ఢిల్లీ వరకు వెళ్లినా ఫలితం లేకపోయింది.

ఈ పరిస్థితుల్లో మనుమరాలు జానకీ దురువ కూలీ నాలీ చేస్తూ అమ్మమ్మ, మేనమామను పోషిస్తోంది. ఈ కుటుంబ పరిస్థితులను చూస్తున్న గ్రామస్తులు దిక్కు లేని ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top