ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై పోలీసుల ఉక్కుపాదం

Police Stops Kisan Rally In Delhi Border - Sakshi

న్యూఢిల్లీ: తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు చేపట్టిన పాదయాత్ర ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పలు డిమాండ్ల సాధనకై కిసాన్‌ క్రాంతి ర్యాలీ పేరిట దాదాపు 20వేల మంది రైతులు హరిద్వార్‌ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి పాదయాత్రగా బయలుదేరారు. ఢిల్లీలోని కిసాన్‌ ఘాట్‌ వద్ద నిరసన తెలుపడానికి సిద్ధమయ్యారు. కాగా మంగళవారం ఉదయం రైతులు ఢిల్లీలో ప్రవేశించకుండా అడ్డుకున్న పోలీసులు.. వారిపైకి వాటర్‌ కెనాన్లను, బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. గాంధీ జయంతి రోజున రైతులపై పోలీసులు ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రుణమాఫీ, ఉచిత కరెంట్‌, స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల అమలుతో పాటు మరికొన్ని డిమాండ్ల సాధనకై రైతులు పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. హరిద్వార్‌ నుంచి బయలుదేరిన రైతులు సోమవారం సాయంత్రం ఘజియాబాద్‌కు చేరుకున్నారు. అక్కడ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మంత్రులు రైతు నాయకులతో చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. తమ సమస్యలపై కచ్చితమైన హామీ వచ్చేవరకు వెనక్కితగ్గేది లేదని రైతులు తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కారిస్తుందని నాలుగేళ్ల పాటు ఎదురుచూశామని.. అయినా లాభం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రైతు నాయకులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఉండేందుకు సరిహద్దులోని రహదారులపై పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటుచేసిన పోలీసులు తూర్పు ఢిల్లీలో 144 సెక్షన్‌ విధించారు. అంతేకాకుండా భారీగా బలగాలను మోహరించారు.

రైతులకు మద్దతు తెలిపిన కేజ్రీవాల్‌, అఖిలేశ్‌
కిసాన్‌ క్రాంతి ర్యాలీ పేరిట రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఖండించారు. రైతులను ఢిల్లీలోకి అనుమతించాలని కోరారు. అలాగే వారిని ఢిల్లీలోకి ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను ప్రశ్నించారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ కూడా రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులు నిరసనకు దిగారని పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top