వాటిపై దృష్టి సారించాం: ప్రధాని మోదీ

PM Narendra Modi Comments Over Union Budget 2020 - Sakshi

న్యూఢిల్లీ: నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆధునిక భారత నిర్మాణానికి కావాల్సిన నైపుణ్యాలపై దృష్టి పెట్టామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ బడ్జెట్‌ పెట్టుబడులు, ఆదాయం, డిమాండ్‌ను పెంచి ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. దేశ ప్రజల అవసరాలను, దశాబ్దపు ఆర్థిక అంచనాలను పరిపూర్ణం చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. దూరదృష్టితో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ ద్వారా అన్ని వర్గాలకు మేలు చేకూరుతుందని.. ఈ దశాబ్దపు తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆమె బృందానికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని పేర్కొన్నారు. వ్యవసాయం, మౌలిక వసతుల కల్పన, జౌళి పరిశ్రమ, సాంకేతిక రంగాల్లో ఉపాధి కల్పనకు దోహదపడుతుందన్నారు. ఆదాయాన్ని పెంచేందుకు 16 కీలక అంశాలపై దృష్టి సారించామని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. (బడ్జెట్‌ 2020 : కేంద్ర బడ్జెట్‌ హైలైట్స్‌)

నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ గురించి మోదీ మాట్లాడుతూ... దేశం నుంచి ఎగుమతులు పెంచేందుకు బడ్జెట్‌లో ప్రోత్సహకాలు కల్పించామన్నారు. యువతకు ఉపాధి, పరిశ్రమల్లో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. అదే విధంగా విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌ కోర్సులు, ఇంటర్న్‌షిప్‌ విధానాలు విదేశాలకు వెళ్లే వారి కోసం బ్రిడ్జ్‌ కోర్సులు ప్రవేశపెట్టనున్నామని పేర్కొన్నారు. నీలి విప్లవంతో మత్స్య పరిశ్రమలో విస్త్రృత అవకాశాలు లభిస్తాయని తెలిపారు. దేశ ఆరోగ్య రంగానికి ఆయుష్మాన్‌ భారత్‌ కొత్త దశను నిర్దేశిస్తుందని వెల్లడించారు. దేశంలో వైద్య పరికరాల తయారీకి ఎన్నో అవకాశాలు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. బడ్జెట్‌లో స్మార్ట్‌సిటీలు, డేటా సెంటర్‌ పార్కులు వంటి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఇక కొత్తగా 100 ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయడం, రవాణా రంగంలో మౌలిక వసతుల కల్పన ద్వారా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తద్వారా ఉద్యోగ కల్పన పెరుగుతుందని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చని  అభిప్రాయం వ్యక్తం చేశారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top