ఇక ‘స్మార్ట్‌ లాక్‌డౌన్‌’

PM Modi to address nation on Due To lockdown Extend - Sakshi

రెండో దశ లాక్‌డౌన్‌లో కీలక మార్పులు

పాక్షికంగా మద్యం అమ్మకాలకు ఓకే

నేటి ప్రధాని ప్రసంగంలో పూర్తి వివరాలు!

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కాలాన్ని పొడిగించడం ఖాయమేనని నిర్ధారణ అయిన నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) దేశాన్ని ఉద్దేశించి చేయనున్న ప్రసంగంలో ఏయే అంశాలను ప్రస్తావించనున్నారు? లాక్‌డౌన్‌ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండబోతోందా? గత మూడువారాలుగా కొనసాగిన విధంగా కఠినంగానే ఉండబోతోందా? ఆంక్షల సడలింపుపై ఏవైనా నిర్ణయాలుంటాయా? ఉంటే.. ఎలాంటి మినహాయింపులుంటాయి? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్నాయి. మూడు వారాల లాక్‌డౌన్‌తో ఇప్పటికే కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థ.. మరో రెండు వారాల పాటు నిర్బంధం ఇలాగే కొనసాగితే ఏ స్థాయికి పడిపోతుందోనని పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ లాక్‌డౌన్‌ కాకుండా.. ఆర్థికాభివృద్ధికి వీలు కల్పించే ‘స్మార్ట్‌ లాక్‌డౌన్‌’ను ప్రధాని ప్రతిపాదించే అవకాశముందని తెలుస్తోంది. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లోనూ.. ప్రాణాలు కాపాడటంతో పాటు దేశæ ఆర్థికాభివృద్ధి పైనా(జాన్‌ భీ.. జహాః భీ) దృష్టి పెట్టాల్సి ఉందని ప్రధాని వ్యాఖ్యానించిన విషయం గమనార్హం.

మద్యం అమ్మకాలకు ఒత్తిడి
ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా చాలామంది ముఖ్యమంత్రులు మద్యం అమ్మకాల విషయం ప్రస్తావించారు. ఖజానాకు అత్యంత కీలకమైన ఆదాయ వనరు అయిన మద్యం అమ్మకాలపై ఆంక్షల సడలింపును వారు కోరారు. బార్లు, రెస్టారెంట్లకు అనుమతివ్వకుండా.. పాక్షికంగా, రోజులో కొన్ని గంటల పాటు అయినా మద్యం అమ్మకాలకు వీలు కల్పించాలన్నారు(దీనిపై కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి). దాంతో, రాష్ట్రాలు కోరితే.. ఆంక్షల సడలింపులో భాగంగా.. మద్యం అమ్మకాలను పాక్షికంగా అనుమతించే అవకాశం ఉంది.  

► స్వల్ప స్థాయిలో దేశీయ విమాన, రైల్వే, మెట్రోరైల్‌ సర్వీసులను అనుమతించే అవకాశం ఉంది. అయితే, 30 శాతం టికెట్లను మాత్రమే విక్రయించేలా ఆంక్షలు పెట్టే అవకాశముంది.
► కొన్ని రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. అంతర్రాష్ట్ర ప్రయాణాలను పలువురు సీఎంలు గట్టిగా వ్యతిరేకించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top