నెమలి జన్యుక్రమాన్ని కనుగొన్నారు

Peacock DNA Structure Was Discovered By IISR Scientists - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మన జాతీయ పక్షి నెమలి జన్యు క్రమాన్ని భోపాల్‌లోని ఐఐఎస్‌ఆర్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నెమలి పురివిప్పినప్పుడు అందంగా కనిపించే నెమలి పించాలు నెమలికి ఎలా వచ్చాయి? బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ నెమలి ఎలా గాల్లోకి సులువగా ఎగురగలుగుతుందన్నది నెమలికి సంబంధించిన రెండు ప్రత్యేక అంశాలు. ఏడాదిన్నర కృషితో ఇప్పుడు నెమలి జన్యుక్రమాన్ని పరిశోధకులు కనుగొనడంతో ఈ రెండు ప్రత్యేక అంశాలు దానికి ఎలా సిద్ధించాయో! సులభంగానే తెలుసుకోవచ్చు. 

నెమలిలో మొత్తం 15,970 జన్యువులు, 110 కోట్ల డీఎన్‌ఏ జతలు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. నెమలికి దగ్గరిగా ఉండే మన నాటు కోడి, టర్కీ కోడితోని పోల్చి చూడగా నెమలిలో 99 జన్యువులు వేరుగా ఉన్నాయి. నెమలి పిండం ఎదగడానికి, దానిలో రోగ నిరోధక శక్తి పెరగడానికే ఈ జన్యువులు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయని వారు తేల్చారు. 99 భిన్నమైన జన్యువులు కనిపించడం తమకు నూతనోత్సాహాన్ని కలిగిస్తోందని ‘బీ10కె ప్రాజెక్ట్‌’ నిర్వాహకుల్లో ఒకరైన గోజీ జాంగ్‌ వ్యాఖ్యానించారు. 2020 నాటికి అన్ని పక్షి జాతుల జీనోమ్‌ను కనుగొనడమే తమ ప్రాజెక్ట్‌ లక్ష్యమని ఆయన తెలిపారు.

కోళ్లు ఏడెనిమిది ఏళ్లు జీవిస్తుండగా, టర్కీ కోళ్లు పదేళ్లు జీవిస్తాయి. నెమళ్లు మాత్రం 25 సంవత్సరాలు జీవిస్తాయి. కోళ్లకన్నా నెమళ్లు ఎక్కువ కాలం జీవించడానికి కారణం అందులో ప్రత్యేకంగా కనిపిస్తోన్న 99 జన్యువులే కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. నెమళ్లలో ఆడ నెమళ్లే తమతో లైంగికంగా జతకట్టే మగనెమళ్లను ఎంపిక చేసుకోవడం వీటిలో ఉండే మరో ప్రత్యేకత. అందుకే ఆడ నెమళ్ల దష్టిలో పడేందుకు మగ నెమళ్లు పురివిప్పి నాట్యమాడుతున్నట్లుగా తిరుగుతాయి. మగ నెమలి పించాల్లో ఎన్ని కనులు ఉన్నాయనే అంశం ఆధారంగానే వాటి లైంగిక జీవితం ఆధారపడుతుంది.

సాధారణంగా ఆడ నెమళ్ళు ఎక్కువ ఈకలపై ఎక్కువ కన్నులున్న నెమళ్లనే జోడిగా ఎంపిక చేసుకుంటాయి. వాటి లైంగిక పటుత్వానికి నెమలి కన్నులు ప్రతీకగా నిలుస్తున్నాయని, ఈ విషయంలో మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top