వెనక్కు తగ్గిన పారా గ్రామపంచాయతీ

Parra Village Suspends Tourist Photography Tax In Goa - Sakshi

గోవా: షారుఖ్‌ ఖాన్‌ నటించిన డియర్‌ జిందగీ సినిమాలో ఓ అందమైన ప్రదేశం అందరినీ కట్టిపడేసింది. ఆ ఒక్క సినిమాలోనే కాదు, పలు సినిమాలు కూడా ఆ లొకేషన్‌లో చిత్రీకరించబడ్డాయి. ఇంతకీ ఆ ప్రదేశం.. గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ పూర్వీకుల గ్రామమైన పారా గ్రామం. చూపు తిప్పుకోలేని అందాలు సొంతం చేసుకున్న ఆ పర్యాటక గ్రామం పర్యాటకులు తీసుకునే ఫొటోలపై పన్ను విధించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడి గ్రామప్రజలు తీసుకున్న నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి విధానాలు అమలు చేస్తే పర్యాటకుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరించారు. పర్యాటకశాఖ సహా పలువురు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెనక్కు తగ్గిన పారా గ్రామపంచాయితీ ప్రస్తుతానికి ఫొటోగ్రఫీ పన్నును నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

దారిపొడవునా స్వాగతం పలికే కొబ్బరి చెట్లు, ప్రకృతి అందాలతో విరసిల్లే ఆ ప్రాంతంలో ఫొటోలు తీసుకోవాలన్నా, వీడియోలు చిత్రీకరించాలన్నా స్వచ్ఛ పన్ను కింద రూ.100 నుంచి రూ.500 చెల్లించాల్సి వచ్చేది. గ్రామపంచాయితీ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమై ఫొటోగ్రఫీ పన్నును నిషేధించటంతో పర్యాటకులకు ఊరట లభించింది. ఈ విషయంపై గ్రామ సర్పంచ్‌ డెలిలా లోబో మాట్లాడుతూ.. ఆదాయం కోసం పన్ను విధించట్లేదని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌ను తగ్గించడానికి, పర్యాటకులు రోడ్లపై చెత్త పడేయకుండా నివారించడానికి స్వచ్ఛ పన్ను ఆలోచన చేశామన్నారు. అయితే దీన్ని ఇప్పుడు అమలు చేయమని వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top