హిజ్రాలకు ‘పాన్‌–ఆధార్‌’ తిప్పలు 

pan card, aadhar registration problems for third genders - Sakshi

పాన్‌లో థర్డ్‌జెండర్‌ ఆప్షన్‌ లేక అనుసంధానంలో ఇబ్బందులు    

న్యూడిల్లీ: దేశంలో వివిధ రకాలుగా వివక్ష, వేధింపులకు గురవుతున్న హిజ్రాలకు పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌ (పాన్‌) రూపంలో కొత్త సమస్య ఎదురైంది. అందరూ తమ ఆధార్‌ సంఖ్యను పాన్‌తో ఈ నెల 31లోపు అనుసంధానించుకోవాలని కేంద్రం, సుప్రీంకోర్టు గతంలో ఆదేశించడం తెలిసిందే. ఆధార్‌ అనుసంధానం కాని పాన్‌ కార్డులు వచ్చే నెల నుంచి రద్దయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే ప్రస్తుతం అనేక ఆర్థిక లావాదేవీలకు, సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఆధార్, పాన్‌లను తప్పనిసరి చేసింది. అయితే ఆధార్‌–పాన్‌ అనుసంధానంలో హిజ్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఆధార్‌ కార్డులో జెండర్‌ ఎంపికలో ఆడ, మగతోపాటు హిజ్రాలకు ప్రత్యేకంగా థర్డజెండర్‌ ఆప్షన్‌ ఉన్నప్పటికీ పాన్‌ కార్డు దరఖాస్తులో ఆ వెసులుబాటు లేకపోవడమే. ఆధార్‌కార్డుల్లో థర్డ్‌ జెండర్‌ అనీ, పాన్‌కార్డుల్లో మాత్రం పురుషుడు/మహిళ అని ఉండటంతో హిజ్రాలు తమ ఆధార్‌ నంబర్లను పాన్‌కు అనుసంధానించుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రభావం దాదాపు 5 లక్షల మంది (తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 70 వేల మంది) హిజ్రాలపై పడుతోంది.  

ఎదురవుతున్న సమస్యలివీ ! 
ఆధార్‌–పాన్‌ లింకింగ్‌ తప్పనిసరి అయిన నేపథ్యంలో హిజ్రాలు ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేయలేకపోతున్నారు. రూ. 50 వేలకు పైబడిన ఆస్తుల క్రయవిక్రయాలకు, ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు పాన్, ఆధార్‌కార్డులు తప్పనిసరి కావడం వీరికి తలనొప్పిగా మారింది. 2017 మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ప్రకారం మ్యూచువల్‌ ఫండ్‌ ఖాతాలను అప్‌డేట్‌ చేయలేకపోతుండటం, బ్యాంక్‌ ఖాతాలు తెరిచేందుకూ ఇబ్బందులు పడుతున్నారు. ‘ట్రాన్స్‌జెండర్‌గా నన్ను నేను అంగీకరించాను. దీనినే ప్రతి గుర్తింపు కార్డూ చాటిచెప్పాలని కోరుకుంటున్నాను. కారు యజమానిగా పత్రాల్లో గుర్తింపుతో పాటు, వైద్య బీమా, ఆస్తి పత్రాలు, పాన్‌కార్డు వరకు అన్నింట్లోనూ ఇదే స్పష్టంగా పేర్కొనాలి’అని హిజ్రాల హక్కుల కోసం పోరాడే కార్యకర్త రేష్మా ప్రసాద్‌ కోరుతున్నారు. 

‘సుప్రీం’తీర్పు ఏం చెబుతోంది ? 
హిజ్రాలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం లభించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (నల్సా) కేసులో సుప్రీంకోర్టు నాలుగేళ్ల క్రితం ఆదేశాలిచ్చింది. సంక్షేమ పథకాల లబ్ధితో మొదలుపెట్టి వీరికి అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని సూచించింది. తమ గుర్తింపును తామే నిర్ధారించుకునే ప్రాథమిక హక్కును వారికి కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు హిజ్రాల కోసం సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేశాయి. పశ్చిమబెంగాల్‌లోని ఓ ప్రభుత్వ ఎయిడెడ్‌ కాలేజీ ట్రాన్స్‌జెండర్‌కు ప్రిన్సిపాల్‌గా అవకాశమిచ్చింది కూడా. కొచ్చి మెట్రో సంస్థ పలు విభాగాల్లో వీరి సర్వీసులు ఉపయోగించుకుంటోంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top