కశ్మీర్‌ హై అలర్ట్‌!

Pakistan Trying to Disrupt Amarnath Yatra - Sakshi

ప్రఖ్యాత అమర్‌నాథ్‌ యాత్ర అర్ధంతరంగా నిలిపివేత

యాత్రపై పాకిస్తాన్‌ ‘ఉగ్ర’ దృష్టి

పాక్‌లో తయారైన మందుపాతర లభ్యం

అమెరికాలో తయారైన స్నైపర్‌ తుపాకీ కూడా  

కశ్మీరం వేడెక్కుతోంది. లోయలో భద్రతా బలగాల పెంపుపై ఊహాగానాలు కొనసాగుతుండగానే.. ప్రతిష్టాత్మక అమర్‌నాథ్‌ యాత్రను నిలిపివేస్తూ శుక్రవారం ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది. యాత్రపై పాక్‌ ఉగ్రదాడికి పాల్పడే అవకాశముందనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అమర్‌నాథ్‌ యాత్రీకులు, ఇతర పర్యాటకులు తక్షణమే తమ పర్యటనను ముగించుకుని కశ్మీర్‌ నుంచి వెనక్కు వెళ్లాలని జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం ఆదేశించింది. యాత్ర మార్గంలో పాకిస్తాన్‌లో తయారైన మందుపాతర, అమెరికా మేడ్‌ స్నైపర్‌ రైఫిల్‌ లభించాయని భారత ఆర్మీ ప్రకటించింది.

యాత్రపై దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని కచ్చితమైన నిఘా సమాచారం వచ్చినట్లు పేర్కొంది. కశ్మీర్‌కు భారీగా బలగాలను పంపిస్తున్నారన్న వార్తలు స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అయితే, అలాంటిదేమీ లేదనీ, అంతర్గత భద్రత, సిబ్బంది మార్పిడి కోసం 10 వేల మందిని పంపేందుకు గత వారమే ఆదేశాలిచ్చామని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడి ప్రజల కన్నా.. భూభాగమే ముఖ్యమని తేలిందని పీడీపీ నేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు.  

శ్రీనగర్‌: అమర్‌నాథ్‌ యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం అనూహ్య ప్రకటన చేసింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు అమర్‌నాథ్‌ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని కచ్చితమైన సమాచారం వచ్చినట్లు భారత ఆర్మీ శుక్రవారం హెచ్చరించింది. దీంతో యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్‌ నుంచి ఉన్నపళంగా వెనక్కు వెళ్లిపోవాలని జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం సూచించింది. దీంతో స్థానిక కశ్మీర్‌ ప్రజల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి.

పరిస్థితులు హింసాత్మకంగా మారే అవకాశం ఉందంటూ అక్కడి ప్రజలు నిత్యావసరాల కొనుగోలుకు దుకాణాల ముందు క్యూలు కడుతున్నారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో గవర్నర్‌ పాలన నడుస్తుండటం తెలిసిందే. జూలై 1న మొదలైన అమర్‌నాథ్‌ యాత్ర ఆగస్టు 15న ముగియాల్సి ఉంది. కాగా, యాత్ర సాగే మార్గాల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలను సైన్యం గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుందని ఆర్మీ 15 కార్ప్స్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ (జీవోసీ) లెఫ్టినెంట్‌ జనరల్‌ కేజేఎస్‌ ధిల్లాన్‌ చెప్పారు.

అమర్‌నాథ్‌ యాత్ర సాగే బల్తాల్, పహల్గామ్‌ మార్గాల్లో భద్రతా దళాలు సోదాలు నిర్వహించగా, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, అమెరికాలో తయారైన ఎం–24 (స్నైపర్‌) తుపాకి లభించాయని వెల్లడించారు. పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశామని ఆయన తెలిపారు. యాత్రికులపై దాడి చేయాలన్న ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసేందుకు భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయని ధిల్లాన్‌ వెల్లడించారు. గత కొన్ని రోజుల్లో భద్రతా దళాలు జరిపిన సోదాల్లో, పాకిస్తాన్‌లోని ఆయుధ కర్మాగారంలో తయారైన మందుపాతర, భారీ స్థాయిలో ఇతర ఆయుధాలు దొరికాయని ధిల్లాన్‌ తెలిపారు.

కశ్మీర్‌ లోయలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు పాకిస్తాన్, ఆ దేశ ఆర్మీ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. జమ్మూ కశ్మీర్‌ డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌తో కలిసి ధిల్లాన్‌ సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘గత మూడు నాలుగు రోజుల నుంచి మాకు నిఘా వర్గాల ద్వారా కచ్చితమైన సమాచారం వస్తోంది. పాకిస్తాన్‌ ఆర్మీ నేతృత్వం, సాయంతోనే ఉగ్రవాదులు అమర్‌నాథ్‌ యాత్రికులపై దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నారు’ అని చెప్పారు.   మరోవైపు అవసరమైతే కశ్మీర్‌ విమానాశ్రయం నుంచి అదనపు విమానాలను నడపడానికి సిద్ధంగా ఉండాలని విమానయాన సంస్థలను డీజీసీఏ ఆదేశించింది.  

ఇక కేంద్రం సిద్ధమైంది: మెహబూబా
పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ ప్రభుత్వం కశ్మీర్‌పై సైనిక శక్తిని ఉపయోగిస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తొలగించే విషయంలో కీలక నిర్ణయం త్వరలోనే రావొచ్చన్న వార్తల నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ ‘ఎట్టకేలకు కేంద్రం సిద్ధమైనట్లుగా ఉంది. ప్రజల కన్నా భూభాగమే ముఖ్యమని ఇండియా నిర్ణయించుకున్నట్లుంది. మీరు (ప్రభుత్వం) దేశంలోని ముస్లిం ఆధిక్య రాష్ట్రం ప్రేమను గెలుచుకోవడంలో విఫలమయ్యారు. మతం ఆధారంగా దేశ విభజనను వ్యతిరేకించి లౌకిక రాజ్యమైన భారత్‌తో కలిసుండాలని నిర్ణయించుకున్న రాష్ట్రమిది. కానీ ఇప్పుడు ఇండియా సిద్ధమైనట్లుగా ఉంది. జమ్మూ కశ్మీర్‌ ప్రజలను దోపిడీ చేసేందుకు కేంద్రం సన్నద్ధమైనట్లుగా కనిపిస్తోంది’ అని ఆరోపించారు. అలాగే మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్‌ ప్రత్యేక హోదా అంశాన్ని కదిలించవద్దని కేంద్రాన్ని కోరింది.

భద్రత కోసమే బలగాలు: కేంద్రం
కశ్మీర్‌లో అంతర్గత భద్రతా పరిస్థితుల దృష్ట్యానే పారా మిలిటరీ బలగాలను కశ్మీర్‌కు పంపుతున్నట్లు కేంద్ర హోం శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇలాంటి విషయాలను బహిరంగంగా చర్చించాల్సిన అవసరం లేదని హోం శాఖ స్పష్టం చేసింది. కశ్మీర్‌కు 10 వేల సిబ్బందిని కేంద్రం జమ్మూ కశ్మీర్‌కు తరలిస్తోందనీ, వారం క్రితమే ఇందుకు సంబంధించిన ఆదేశాలు వచ్చాయని హోం శాఖ వర్గాలు చెప్పాయి.

భయం రేకెత్తిస్తున్నారు: ఎన్‌సీ, పీడీపీ
యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్‌ నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పడం ద్వారా కశ్మీర్‌ లోయలో ప్రభుత్వం భయం రేకెత్తిస్తోందనీ, ఇలాంటి పరిస్థితిని తాము ఇంతకుముందెన్నడూ చూడలేదని జమ్మూ కశ్మీర్‌లోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ), పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) మండిపడ్డాయి. ఎన్‌సీ నేత ఒమర్‌ అబ్దుల్లా ఓ ట్వీట్‌ చేస్తూ, ‘ఉన్నపళంగా వెళ్లిపోవాలని యాత్రికులు, పర్యాటకులకు ప్రభుత్వమే చెబితే వారిలో భయం కలగదా? వారంతా తక్షణం అన్నీ సర్దు కుని వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు విమానాశ్రయాలు, రహదారులు పూర్తిగా జనంతో కిక్కిరిసిపోతాయి’ అని అన్నారు. కశ్మీర్‌కు రాజ్యాంగం ఇస్తున్న హక్కులను కాపాడాలని కాంగ్రెస్‌ పార్టీ కేంద్రాన్ని కోరింది. మాజీ ప్రధాని మన్మోహన్‌æ అధ్యక్షతన జమ్మూ కశ్మీర్‌ అంశంపై కాంగ్రెస్‌ ఓ భేటీ నిర్వహించిన అనంతరం కేంద్రానికి ఈ విజ్ఞప్తి చేసింది.

కశ్మీర్‌లో భయం భయం..
ఉగ్రవాదులు దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నందున అమర్‌నాథ్‌ యాత్రికులు, పర్యాటకులు వెంటనే కశ్మీర్‌ నుంచి వెనక్కు వెళ్లిపోవాలంటూ ప్రభుత్వం ప్రకటన చేయడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు సరకులు, ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేసి ముందస్తుగా భద్రపరచుకునేందుకు దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. ఏటీఎంలు, పెట్రోల్‌ బంకుల ముందు భారీ వరుసల్లో నిలబడుతున్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగించే విషయమై కీలక నిర్ణయం రానుందనీ, ఆ కారణంగా గొడవలు జరిగి శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పుకార్లు వస్తున్నాయి. దీంతో సరకులను ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకునేందుకు స్థానికులు క్యూలు కట్టారు.  

పోలీసు సోదాల్లో దొరికిన అమెరికా తయారీ అత్యాధునిక రైఫిల్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top