భారత్‌కు పాకిస్తాన్‌ వార్నింగ్‌

Pakistan Fears Over Surgical Strikes Again Warns India - Sakshi

శ్రీనగర్‌, జమ్మూకశ్మీర్‌ : మరోసారి సర్జికల్‌ స్ట్రైక్స్‌కు పాల్పడొద్దని, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భారత్‌కు పాకిస్తాన్‌ వార్నింగ్‌ ఇచ్చింది. శనివారం కశ్మీర్‌లో గల సుంజువాన్‌ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

దీనిపై విచారణ చేపట్టిన భారతీయ ఆర్మీ.. పాకిస్తాన్‌కు చెందిన జైషే ఈ మొహమ్మద్‌(జేఈఎమ్‌) అనే ఉగ్ర సంస్థకు ఈ దాడితో సంబంధం ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రకటనపై ఆందోళన చెందుతున్న పాకిస్తాన్‌ మరోసారి భారత్‌ నిర్దేశిత దాడులకు(సర్జికల్‌ స్ట్రైక్స్‌) దిగుతుందేమోనని భయపడుతోంది.

జేఈఎమ్‌కు సుంజువాన్‌ క్యాంపుపై దాడికి సంబంధం ఉందన్న భారత మిలటరీ ప్రకటనపై పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. భారత అధికారులు కావాలనే జేఈఎమ్‌ను ఈ దాడిలోకి లాగుతున్నారని ఆరోపించింది. సరైన విచారణ జరపకుండా బాధ్యతారాహిత్యంతో ప్రకటనలు చేయడం సరికాదని పేర్కొంది.

పాకిస్తాన్‌ భూభాగంలోకి అక్రమంగా చొచ్చుకొస్తున్న భారత్‌ను అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. కాగా, సుంజువాన్‌ ఆర్మీ క్యాంపుపై జరిగిన ముష్కరుల దాడిలో ఐదుగురు జవాన్లు అమరవీరులు అయ్యారు. మరో జవాను తండ్రి కూడా ప్రాణాలు విడిచారు. పది మంది జవానుల కుటుంబీకులు కూడా ఈ దాడిలో గాయపడ్డారు.

సోమవారం శ్రీనగర్‌లోని ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడికి జరిగిన యత్నాన్ని భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top