
మైసూర్ : ఆ యాచకురాలి దాతృత్వం అందరి హృదయాలను ఆకట్టుకుంటోంది. ఎక్కడైతే తాను ఏళ్లుగా కూర్చుని యాచక వృత్తిని కొనసాగిస్తుందో ఆ టెంపుల్‌కే ఏకంగా రెండున్నర లక్షల మేర రూపాయలను విరాళంగా అందించింది ఓ వృద్ధురాలు. ఆమెనే ఎంవీ సీతాలక్ష్మి. ఓంటికొప్పల్‌లోని ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో కూర్చుని గత దశాబ్ద కాలంగా యాచక వృత్తిని కొనసాగిస్తోంది. తను ఏం చేయలేని పరిస్థితుల్లో ఆమె ఈ యాచక వృత్తిని ప్రారంభించింది. ఇలా సంపాదించిన మొత్తంలో రెండున్నర లక్షలను ఆలయ సౌకర్యాలను మెరుగు పరచడానికి, హనుమాన్ జయంతికి ప్రతి ఏడాది వచ్చే భక్తులకు ప్రసాదాలు ఇవ్వడానికి వినియోగించాలని కోరుతూ విరాళంగా అందించింది.
తొలుత గణేష్ ఉత్సవం సందర్భంగా రూ.30వేల అందించిందని, తర్వాత ఇటీవల మరో రెండు లక్షలకు పైగా నగదును అందించిందని ఆలయ నిర్వహకులు చెప్పారు. మొత్తంగా సీతాలక్ష్మి రెండున్నర లక్షలను విరాళంగా అందించింది. సోదరుడు, సోదరి భార్యతో యాదవగిరిలో నివసిస్తున్న సీతాలక్ష్మి, తనకు ప్రతిదీ ఆ దేవుడే అంటూ చెబుతోంది. తనను ఆ దేవుడే బాగా చూసుకుంటున్నాడని, అందుకే ఈ విరాళం ఇచ్చినట్టు పేర్కొంది. సీతాలక్ష్మి ఇతర యాచకులా కాదని, భక్తుల నుంచి అసలు నగదును డిమాండ్ చేయదని, వాళ్లు ఏమిస్తే అదే స్వీకరిస్తుందని ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఎం బసవరాజ్ చెప్పారు. ఆలయ అధికారులు ఆమెను చాలా బాగా చూసుకుంటారని తెలిపారు.