నాడు మోదీది ఎంత చక్కటి నవ్వో


న్యూఢిల్లీ: దేశంలో చాలా మంది రాజకీయ నాయకులు పరస్పరం జోకులేసుకోవడం, వాటికి పగలబడి నవ్వడం చాలా అరుదు. ఇక ప్రసంగాల విషయానికొస్తే అరవీర భయంకరుల్లా గంభీరోపన్యాసాలిస్తారు. అప్పడప్పుడు మాత్రమే భావోద్వేగంతో ప్రసంగాన్ని రక్తికట్టిస్తారు. హాస్యానికి అవకాశం ఇవ్వరు. ఇక మన ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గంభీరంగా ప్రసంగించడంలో మొదటి నుంచి ఆరితేరిన వారు. ‘మీ ఉపన్యాసాలన్నీ హాస్యం లేకుండా ఎందుకంత గాంభీర్యంగా సాగుతాయి?’ అని  ఓ దశాబ్దం క్రితం ఓ టీవీషోకు హాజరైన నరేంద్ర మోదీని ప్రశ్నించగా, ‘రాజకీయ నాయకుల ప్రజా జీవితంలో హాస్యం చోటులేదన్న భయం నాకుంది. చాలా మందికి అలాంటి భయం ఉంటుంది. అలాగే నాకు అలాంటి భయం ఉంది’ అని సమాధానమిచ్చారు.






ప్రసంగాల్లో తన గాంభీర్యానికి కారణం చెప్పిన మోదీ అదే టీవీ షోలో చాలా ఉల్లాసంగా, చాలా చక్కగా నవ్వుతూ తనలో కూడా హాస్యం ఉందని చాటి చెప్పారు. ‘మీరు బీజేపీ పార్టీని వదిలిపెట్టాలనుకున్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో ఖాళీ వుంటే వచ్చి చేరుతారా?’ అని అదే షోలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకుడు జైరామ్‌ రమేశ్‌ ప్రశ్నించగా, ‘నేను సంఘ్‌ పరివార్‌ నుంచి వచ్చాను. నా వల్ల మీకు ఎన్నో సమస్యలు వస్తాయి’ అంటూ ఆయన నవ్వారు. ఈ షోలో పాల్గొన్నప్పుడు నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా కూడా లేరు. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.


అప్పుడు జైరామ్‌ రమేష్, మోదీలు యువకులుగానే ఉన్నారు. వారిద్దరితో జర్నలిస్ట్‌ వీర్‌ సాంఘ్వీ నిర్వహించిన టీవీ షోకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. టీవీ షోలో మోదీ ఇచ్చిన సమాధానాలు చారిత్రాత్మకం అంటూ సోషల్‌ మీడియాలో కొంత మంది మోదీని ప్రశంసిస్తున్నారు. అప్పటి టీవీ చర్చాగోష్టుల్లో  వివిధ పార్టీల రాజకీయ నాయకుల మధ్య వ్యంగ్యాస్త్రాలు, చలోక్తులు ఉన్నప్పటికీ ఇప్పటిలాగా అరుపులు, కేకలు, తిట్లు ఉండేటివి కావు.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top