ఆమె భారత్‌కు రాలేదు: ప్రభుత్వం | No record to show US shooter visited India: Govt | Sakshi
Sakshi News home page

ఆమె భారత్‌కు రాలేదు: ప్రభుత్వం

Dec 10 2015 8:51 AM | Updated on Sep 3 2017 1:47 PM

ఆమె భారత్‌కు రాలేదు: ప్రభుత్వం

ఆమె భారత్‌కు రాలేదు: ప్రభుత్వం

కాలిఫోర్నియా కాల్పుల నిందితురాలు తష్ఫీన్ మాలిక్ 2013లో భారత్ వచ్చినట్టు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర నిఘా సంస్థలు స్పష్టం చేశాయి.

న్యూఢిల్లీ: కాలిఫోర్నియా కాల్పుల నిందితురాలు తష్ఫీన్ మాలిక్ 2013లో భారత్ వచ్చినట్టు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర నిఘా సంస్థలు స్పష్టం చేశాయి. సౌదీ హోంమంత్రిత్వ శాఖ అధికారులు తష్ఫీన్ భారత్‌ను సందర్శించిందని పేర్కొన్న నేపథ్యంలో నిఘా వర్గాలు ఆమె గురించి ఆరా తీశాయి. ఇందుకు సంబంధించి ఇమ్మిగ్రేషన్, వీసా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. పాకిస్థానీ మహిళ అయిన తష్ఫీన్‌కు చెందిన రెండు పాస్‌పోర్టుల (ఒకటి పాకిస్థాన్, మరొకటి రియాద్ జారీ చేశాయి) వివరాలు ఇమ్మిగ్రేషన్ రికార్డుల్లో నమోదు కాలేదని నిఘా అధికారులు బుధవారం నిర్ధారణకు వచ్చారు.

ఈ నేపథ్యంలో తష్ఫీన్ భారత్ మీదుగా మరో దేశానికి వెళ్లి ఉంటుందని, అలాంటి సందర్భంలోనే ఆమె వివరాలు ఇమ్మిగ్రేషన్ రికార్డుల్లో నమోదుకావని ఓ అధికారి తెలిపారు. 'ఒక పాకిస్థాన్ పౌరుడు ఇమ్మిగ్రేషన్ తనిఖీలు, నిఘా నేత్రం నుంచి తప్పించుకొని వెళ్లే వీలు లేదు. వారి విషయంలో నిబంధనలు కఠినంగా ఉంటాయి. కాబట్టి ఆమె అసలే భారత్‌కు రాకపోయి ఉండొచ్చు. లేదా మరో దేశానికి వెళ్లేందుకు కనెక్టింగ్ విమానం ఎక్కేందుకు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు' అని ఆ అధికారి వివరించారు.

తష్ఫీన్ మాలిక్ రెండుసార్లు సౌదీ అరేబియా వెళ్లిందని, ఆ తర్వాత ఓసారి బ్రిటన్‌లో పర్యటించి.. అనంతరం భారత్‌ వెళ్లిందని సౌదీ హోంమంత్రిత్వశాఖ అధికారులు గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. తష్ఫీన్ మాలిక్, ఆమె భర్త సయెద్ రిజ్వాన్ ఫరుక్ గతవారం కాలిఫోర్నియాలో కాల్పులతో విరుచుకుపడి 14మందిని హతమార్చారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న అమెరికా పోలీసులు కాల్పులకు ప్రేరేపణ ఏమిటి అన్న అంశాన్ని శోధిస్తున్నారు. ఇందులో భాగంగా పాకిస్థాన్ మహిళ అయిన తష్ఫీన్ నేపథ్యం, ఆమె గత జీవితాన్ని క్షుణ్ణంగా వెలుగులోకి తీసుకువస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement