‘కాల్చి వేయండి’ అన్నా చర్య తీసుకోరా!?

No Action on Goli Maro Minister Anurag Thakur - Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బహిరంగ ప్రచారానికి ఈ రోజు చివరి రోజు కావడంతో పాలకపక్ష ఆప్, బీజేపీ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌తోపాటు ఆప్‌ పార్టీ ముఖ్య నేతలు వీధి వీధిన ప్రచారం చేస్తుండగా, బీజేపీ తరఫున అమిత్‌ షా, మోదీలతోపాటు ‘దేశ ద్రోహులను కాల్చేయండి’ అని బీజేపీ కార్యకర్తలకు పిలుపునివ్వడం ద్వారా మూడు రోజులపాటు ఎన్నికల ప్రచారానికి దూరమైన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తిరిగి ప్రచారానికి వచ్చారు.

సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా షహీన్‌ బాగ్‌లో ఆందోళన చేస్తున్న వారంతా దేశద్రోహులని వారిని కాల్చేయండంటూ అనురాగ్‌ ఠాకూర్‌ పిలుపునిచ్చిన అనంతరం మూడు చోట్ల ఆందోళనకారులపై కాల్పులు జరిగాయి. ‘మా పిల్లలను ఎవరో తప్పుదోవ పట్టించడంతో గందరగోళంలో కాల్పులు జరిపారు’ అని మరో బీజేపీ ఎంపీ అర్జున్‌ సింగ్‌ సమర్థించారు. ఇంత బహిరంగంగా హింసాకాండను ప్రోత్సహిస్తున్న పార్టీ నాయకులను బీజేపీ అధిష్టానం కనీసం మందలించక పోవడం ఏమిటని ఎన్నికల ప్రచారంలో ఆప్‌ నాయకులు నిలదీస్తున్నారు.

‘పౌరసత్వం నిరూపణకు డాక్యుమెంట్లు అడిగితే వారిని కొట్టండి’ అనే అభ్యంతరకర వ్యాక్యం కర్ణాటక ముస్లిం పాఠశాలలో వేసిన ఓ నాటకంలో ఉన్నందుకు తొమ్మిది నుంచి పన్నేండేళ్ల పిల్లలను ఐదు రోజులపాటు పోలీసులు ఇంటరాగేట్‌ చేయడంతోపాటు, దేశ ద్రోహం కేసు కింద ఓ టీచర్‌ను, ఓ పేరెంట్‌ను అరెస్ట్‌ చే యడాన్ని ఆప్‌ నేతలు ప్రస్తావిస్తున్నారు. ‘సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా నోరు విప్పితే దేశద్రోహం కేసు పెడతారా? అదే ఆందోళనకారులను కాల్చేయండంటూ పిలుపునిస్తే ఎలాంటి చర్య తీసుకోరా?’ ఇదేమి ప్రజాస్వామ్యం అని ఆప్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. (చదవండి: షహీన్‌ బాగ్‌పై మరో నకిలీ వీడియో!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top