పీఎన్‌బీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Published Thu, Feb 22 2018 2:29 AM

Nirav Modi denies allegations in PNB scam  - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ.11,400 కోట్ల పీఎన్‌బీ కుంభకోణానికి బాధ్యులైన వారిచుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ జిందాల్‌ (2009–11 మధ్య కుంభకోణం జరిగిన పీఎన్‌బీ బ్రాడీహౌజ్‌ బ్రాంచ్‌ హెడ్‌) సహా తొమ్మిది మంది బ్యాంకు ఉన్నతాధికారులనూ సీబీఐ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. వీరంతా.. మోదీ, చోక్సీలకు మేలు జరిగేలా అబద్ధపు గ్యారెంటీలను జారీచేశారన్నకోణంలో విచారణ జరుగుతోంది. ఈ కుంభకోణాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈడీ దేశవ్యాప్తంగా పలుచోట్ల సోదాలు నిర్వహించింది.

ఈడీ చీఫ్‌ కర్నల్‌ సింగ్‌ తన ఫ్రాన్స్‌ పర్యటన (అంతర్జాతీయ మనీల్యాండరింగ్‌ కేసుల విచారణ సంస్థల సదస్సు)ను రద్దుచేసుకుని మరీ వ్యక్తిగతంగా ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తున్నారు. అటు ఆరోరోజు దేశవ్యాప్తంగా పలుచోట్ల నీరవ్‌ మోదీ, చోక్సీలకు సంబంధించిన ఆస్తులపై ఈడీ, సీబీఐ దాడులు జరిగాయి. ముంబై సమీపంలోని అలీబాగ్‌లో ఉన్న నీరవ్‌ మోదీ విలాసవంతమైన ఫామ్‌హౌజ్‌ (1.5 ఎకరాల)ను సీబీఐ బుధవారం సీజ్‌ చేసింది. 2004లో 32 కోట్లకు నీరవ్‌ దీన్ని కొనుగోలు చేశారు. చోక్సీకి సంబంధించిన గీతాంజలి జెమ్స్, ఇతర సంస్థలపై ముంబై, పుణే, హైదరాబాద్, సూరత్, బెంగళూరు సహా 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.

రొటొమ్యాక్‌ ఆస్తులు అటాచ్‌
రూ.3,695 కోట్ల రుణ ఎగవేత కేసుకు సంబంధించిన కేసులో రొటొమ్యాక్‌ కంపెనీ అధినేత విక్రమ్‌ కొఠారీ, ఆయన కుమారుడు రాహుల్‌లకు చెందిన ఆస్తులను ఐటీ శాఖ అటాచ్‌ చేసింది. కాన్పూర్‌లోని మూడు స్థిరాస్తులు, అహ్మదాబాద్‌లోని ఒక భవంతిని అటాచ్‌ చేసింది. వీటి విలువ రూ. 85 కోట్లు. విక్రమ్, రాహుల్‌లను ఢిల్లీలో సీబీఐ బుధవారం విచారించింది.  

సర్కారుకు స్వేచ్ఛనివ్వాలి: సుప్రీం
పీఎన్‌బీ  కేసు దర్యాప్తులో కేంద్రానికి పూర్తి స్వేచ్ఛ కావాలని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు సరిగ్గా చేయని పక్షంలోనే తామే జోక్యం చేసుకుంటామంది.

Advertisement
Advertisement