
పఠాన్ కోట్ ఉగ్రదాడిపై కేసు నమోదు
పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి ఘటనపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కేసు నమోదు చేసింది.
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి ఘటనపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కేసు నమోదు చేసింది. ముందుగా పఠాన్ కోట్ లోని స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. తర్వాత ఈ కేసు ఎన్ఐఏకు బదిలీ చేసి, దర్యాప్తు బాధ్యత అప్పగించారు. అక్రమాయుధాలు కలిగివుండడం, అసాంఘిక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు పెట్టినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
26/11 దాడి తర్వాత ఉగ్రవాద కేసులను దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏను ఏర్పాటు చేశారు. పఠాన్ కోట్ దాడి వెనుక పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద జైషే-ఈ-మొహ్మద్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. సైనిక ఆపరేషన్ తర్వాత ఆర్మీ, ఎన్ఎస్ జీ అంగీకారంతో తీవ్రవాదుల మృతదేహాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుని దర్యాప్తు మొదలు పెడుతుంది. ఉగ్రవాదుల చొరబాటు నుంచి అన్ని విషయాలపై దృష్టి సారిస్తుంది.