
ఇన్‌స్పెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న మాజీమంత్రి కాకాణి, ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి తదితరులు
పోలీసుల అత్మస్థైర్యం దెబ్బతినేలా అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు
నెల్లూరు జిల్లాలో పోలీసులకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
నెల్లూరు (క్రైమ్): పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా, వారిని కించపరిచేలా మాట్లాడిన స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నేతలు మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీమంత్రి, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ కె.సత్యనారాయణరెడ్డి తదితరులు నెల్లూరు నగరంలోని వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావుకు ఈ ఫిర్యాదు ఇచ్చారు.
అనంతరం కాకాణి మీడియాతో మాట్లాడుతూ బాధ్యతాయతమైన స్పీకర్ పదవిలో ఉన్న అయ్యన్నపాత్రుడు పోలీసుల్ని కించపరిచే వి«ధంగా దుర్భాషలాడడం సిగ్గుచేటని చెప్పారు. ఆయనపై తక్షణమే కేసు నమోదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. ఇటీవల స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లా దొండపూడిలో కొత్తకోట సీఐ, ఎస్‌ఐలను నోటికొచి్చనట్లు మాట్లాడారని చెప్పారు. ఎస్కార్ట్ ఆలస్యమైందని పోలీసు అధికారులను తిట్టడం, అందుకు టీడీపీ నాయకులు ఈలలు వేయడం, చప్పట్లు కొట్టడం సిగ్గుచేటన్నారు.
అవి.. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదని చెప్పారు. అయ్యన్న వ్యాఖ్యలు పోలీసుల ఆత్మాభిమానాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నా.. ఇంతవరకు పోలీసు అధికారుల సంఘం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. గతనెలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనకు వస్తే.. పోలీసు అధికారుల సంఘం వారు విలేకరుల సమావేశం నిర్వహించి జగన్‌మోహన్‌రెడ్డి అవినీతిపరులను పరామర్శించేందుకే వచ్చారని మాట్లాడారని అన్నారు.
తమను న్యాయస్థానాలు దోషులుగా నిర్ధారించకపోయినా పోలీసు అధికారుల సంఘం దోషులమని నిర్ధారించడం దారుణమన్నారు. స్పీకర్ పోలీసు అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసినా పోలీసు అధికారుల సంఘం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు ఏం మాట్లాడినా భరిస్తామని, ప్రతిపక్ష నాయకులు పోలీసుల పేరు ఎత్తితే భరించబోమన్నట్లు వారి తీరు ఉందని చెప్పారు. పోలీసు అధికారులను దుర్భాషలాడిన స్పీకర్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని ఎస్పీని కోరారు.
పోలీసులకే రక్షణ కొరవడింది
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లడుతూ శాంతిభద్రతలను కాపాడే పోలీసులపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం బాధాకరమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకే రక్షణ కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.