న్యూయార్క్‌ కన్నా మన ముంబైలోనే చౌక

New York is Far More Expensive Than Mumbai - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆధునిక జీవన శైళికి సంబంధించి చాలా విషయాల్లో అమెరికాలోని న్యూయార్క్‌ నగరం కన్నా మన ముంబై నగరం ఎంతో చీప్‌. సినిమా టిక్కెట్లు, టాక్సీ ట్రిప్పులు, ఫ్యాన్సీ డిన్నర్లు న్యూయార్క్‌ కన్నా ముంబైలో 17 శాతం నుంచి 33 శాతం వరకు చౌకని దాయ్‌చూ బ్యాంక్‌ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. ఇక ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌లయితే న్యూయార్క్‌ నగరం కన్నా మన ముంబైలోనే యమ ఖరీదు. అక్కడికన్నా ఇక్కడ 131 శాతం ధర ఎక్కువ. పెట్రోలు కూడా అక్కడి కన్నా ఇక్కడే ఎక్కువ. అందుకు కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరుగుతుండడం, అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం, అధిక పన్నులు అందుకు కారణం.

ఆపిల్‌ ఉత్పత్తులైన మ్యాక్‌బుక్స్, ఐపాడ్స్, ఆపిల్‌ వాచ్‌లు ఒక్క న్యూయార్క్‌ ఏమిటో ప్రపంచంలోని అనేక దేశాల్లోకెల్లా భారత్‌లోనే ఖరీదు. ఈ విషయాన్ని ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ స్వయంగా అంగీకరించారు కూడా. 2018, సెప్టెంబర్‌ నెలలో మార్కెట్‌లోకి వచ్చిన ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌ ధర భారత్‌లో 1635 డాలర్లు (1.14 లక్షల రూపాయలు). అదే అమెరికాలో 1250 డాలర్లు.  మన కన్నా అర్జెంటీనా, టర్కీ, బ్రెజిల్‌ దేశాల్లో మనకన్నా ఐఫోన్‌ ధర ఎక్కువే. ఆపిల్‌ ఉత్పత్తులపై మన దేశం దిగుమతి సుంకాలను ఎక్కువగా పెంచడం, ఆపిల్‌ కంపెనీ కాకుండా మధ్యవర్తితో అమ్మకాలు జరిపించడం వల్ల ధరలు అధికంగా ఉంటున్నాయి. సెల్‌ఫోన్ల కొనుగోళ్లలో ప్రపంచంలోనే భారత రెండవ పెద్ద దేశం అవడం వల్ల ఇక భారత్‌లో తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించేందుకు ఆపిల్‌ ప్రయత్నాలు చేపట్టింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top