ప్రణాళిక సంఘానికి కొత్త రూపు | New model on planning commission | Sakshi
Sakshi News home page

ప్రణాళిక సంఘానికి కొత్త రూపు

Dec 6 2014 1:08 AM | Updated on Aug 15 2018 2:20 PM

మారుతున్న కాలానికి తగ్గట్టు ప్రణాళిక సంఘాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో వెల్లడించారు.

కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందన్న ప్రధాని
ముఖ్యమంత్రులతో విస్తృతంగా చర్చిస్తానని లోక్‌సభలో వెల్లడి
 
న్యూఢిల్లీ: మారుతున్న కాలానికి తగ్గట్టు ప్రణాళిక సంఘాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో వెల్లడించారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల్లోలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రణాళిక సంఘం పునర్నిర్మాణానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు మేధావులను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ‘ఆదివారం  అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నాను. వారితో విస్తృతంగా చర్చిస్తాను. మార్పులపై ప్రణాళిక సంఘంలోనూ ఇదివరకే చర్చలు జరిగాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపడతాం’ అని  తెలిపారు.
 
 అంతకుముందు ప్రణాళిక శాఖ మంత్రి ఇందర్‌జీత్‌సింగ్ మాట్లాడుతూ.. పేదలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సంస్కరణలకు తగినట్లుగా దేశంలో ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరముందని, ఈ దిశగా ప్లానింగ్ కమిషన్‌ను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. కీలక రంగాల్లో విదేశీ నిధులను  అనుమతిస్తున్న తరుణంలో ప్రణాళికలను తరచూ సమీక్షించాల్సి ఉంటుందని, భారత్ గొప్ప ఆర్థికశక్తిగా ఎదుగుతున్నందున ప్రణాళికల్లోనూ మార్పులు రావాల్సిన అవసరముందన్నారు. ‘జాతీయాభివృద్ధిలో రాష్ట్రాలూ కీలకం.
 
 అభివృద్ధికి అవే చోదకాలు. వాటినీ దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలను రూపొందించా’లన్నారు. ప్రణాళిక సంఘంలో మార్పులపై కేంద్ర ం ఇప్పటికే విస్తృత మంతనాలు జరుపుతున్నట్లు తెలిపారు. ఆర్థిక రంగం ఎదుర్కొనే సవాళ్లను ఎదుర్కొనేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రచించేలా.. ఆర్థికాభివృద్ధిలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించేలా కొత్త ప్రణాళిక వ్యవస్థ రూపుదిద్దుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement