ఏకకాల ఎన్నికలే ఉత్తమం | Need To Take Growth To Double Digits says PM Modi At NITI Aayog Meet | Sakshi
Sakshi News home page

ఏకకాల ఎన్నికలే ఉత్తమం

Published Mon, Jun 18 2018 2:20 AM | Last Updated on Wed, Oct 17 2018 6:01 PM

Need To Take Growth To Double Digits says PM Modi At NITI Aayog Meet - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై విస్తృత చర్చ జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక వృద్ధి రేటును రెండంకెలకు తీసుకెళ్లడం భారత్‌ ముందున్న ప్రధాన సవాలని, అందుకోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో నీతిఆయోగ్‌ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ భేటీకి 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక లెఫ్టినెంట్‌ గవర్నర్‌ హాజరయ్యారు. సమావేశంలో సీఎంలు వెలిబుచ్చిన అభిప్రాయాల్ని, సలహాల్ని విధాన నిర్ణయాల అమలులో పరిగణనలోకి తీసుకుంటామని ప్రధాని హామీనిచ్చారు.  

ముఖ్యమంత్రుల ప్రసంగం అనంతరం మోదీ ముగింపు ఉపన్యాసం చేస్తూ.. ‘లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై విస్తృత స్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరపాలి. దీనివల్ల ఖర్చును ఆదా చేయవచ్చు. అదే సమయంలో వనరుల్ని సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది’ అని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఏకకాలంలో ఎన్నికల అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ.. నీతి ఆయోగ్‌ భేటీలో పునరుద్ఘాటించారు.

విధానాల రూపకల్పనలో సీఎంల పాత్ర కీలకమని ఆయన ప్రశంసించారు. ఫలితం ఆధారంగా కేటాయింపులు జరిగేలా, ఖర్చుల్లో సవరణల కోసం 15వ ఆర్థిక సంఘానికి సలహాలు ఇవ్వాలని ముఖ్యమంత్రుల్ని కోరారు. ‘భారత్‌లో సామర్థ్యం, వనరుల కొరత లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. కేంద్రం నుంచి రాష్ట్రాలు రూ. 11 లక్షల కోట్లు అందుకుంటాయి. గత ప్రభుత్వం చివరి సంవత్సరంలో ఇచ్చిన దానికంటే రూ. 6 లక్షల కోట్లు ఎక్కువ ఇస్తున్నాం’ అని మోదీ చెప్పారు. వరద పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు కేంద్రం నుంచి అన్ని రకాల సాయాన్ని అందచేస్తామని భరోసా నిచ్చారు.  

అభివృద్ధి కోసం నీతి ఆయోగ్‌ మంచి వేదిక
2017–18 నాలుగో త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 7.7 శాతంగా ఉందని, ఈ వృద్ధి రేటును రెండంకెల స్థాయికి తీసుకెళ్లడం మన ముందున్న సవాలని, అందుకోసం అనేక చర్యల్ని చేపట్టాల్సి ఉందని ప్రధాని పేర్కొన్నారు. త్వరలోనే భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల(రూ. 3.4 కోట్ల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాలని ప్రపంచం ఆశిస్తుందని చెప్పారు.  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, వెనకబడ్డ జిల్లాల (ఆస్పిరేషనల్‌ డిస్ట్రిక్ట్స్‌) అభివృద్ధి, ఆయుష్మాన్‌ భారత్, మిషన్‌ ఇంద్రధనుష్, పౌష్టికాహార మిషన్, మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు తదితర అంశాల్ని మోదీ ప్రస్తావించారు. ‘2020 నాటికి నవభారత లక్ష్యాన్ని చేరుకునేందుకు తగిన చర్యలు తప్పనిసరి’ అని ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో చారిత్రక మార్పులు తీసుకువచ్చేందుకు నీతి ఆయోగ్‌ పాలక మండలి మంచి వేదిక అని కితాబునిచ్చారు.  

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును ప్రస్తావించిన ప్రధాని  
స్వచ్ఛ్‌ భారత్‌ మిషన్, డిజిటల్‌ లావాదేవీలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై విధానాల రూపకల్పనలో సబ్‌ గ్రూపులు, కమిటీల ద్వారా ముఖ్యమంత్రులు కీలక పాత్ర పోషించారని మోదీ గుర్తుచేశారు. ఈ సబ్‌ గ్రూపులు చేసిన సిఫార్సుల్ని కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు పరిగణనలోకి తీసుకున్నాయని ఆయన చెప్పారు. ‘ఆయుష్మాన్‌ భారత్‌’ కింద దేశంలో 1.5 లక్షల వైద్య, సంరక్షణ కేంద్రాల్ని నిర్మిస్తున్నాం. ఈ పథకంలో 10 కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ. 5 లక్షల వరకూ ఆరోగ్య బీమాను అందిస్తాం.

విద్య కోసం ‘సమగ్ర శిక్షా అభియాన్‌’ కింద సమగ్ర విధానాన్ని అమలుచేస్తున్నాం. ముద్రా యోజన, జన్‌ధన్‌ యోజన, స్టాండప్‌ ఇండియాలు ప్రజల ఆర్థిక అవసరాలకు చేయూతగా ఉంటున్నాయి’ అని ప్రధాని చెప్పారు. దేశంలో అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న(ఆస్పిరేషనల్‌) 115 జిల్లాల్లో అన్ని విధాల అభివృద్ధి సాధించాల్సిన అవసరముందని అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం, పెట్టుబడిని తగ్గించి పంటల దిగుబడిని పెంచే విధంగా సూచనలు చేయాలని బిహార్, ఆంధ్రప్రదేశ్, యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌తో పాటు పలు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని సూచించారు.  

రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని నీతి ఆయోగ్‌కు సూచన
సమావేశంలో వ్యక్తమైన సలహాల్ని విధానపర నిర్ణయాలు తీసుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటామని మోదీ హామీనిచ్చారు. అమలు చేయదగ్గ సలహాలు, సూచలనపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని నీతి ఆయోగ్‌కు ఆయన సూచించారు. సమావేశంలో కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఒడిశా, జమ్మూ కశ్మీర్, ఢిల్లీ తదితర రాష్ట్రాల సీఎంలు గైర్హాజరయ్యారు. సమావేశం అనంతరం నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ.. బిహార్, ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో ఇచ్చిన అన్ని హామీల్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారన్నారు. గత నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం 7.7 కోట్ల మరుగుదొడ్లను నిర్మించిందని, మహాత్మా గాంధీ 150 వ జయంతి వేడుకల నాటికి దేశంలో 100 శాతం పారిశుధ్యం సాధించాలని ఆకాంక్షించారన్నారు.

ఢిల్లీ సంక్షోభాన్ని పరిష్కరించండి
ప్రధానికి నలుగురు సీఎంల విజ్ఞప్తి

ఢిల్లీలో లెఫ్టినెంట్‌ గవర్నర్, ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న గొడవలో జోక్యం చేసుకోవాలని పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. నీతి ఆయోగ్‌ పరిపాలక మండలి సమావేశం వేదికగా.. మమతా బెనర్జీ, చంద్రబాబు, కుమారస్వామి, పినరయి విజయన్‌లు ఢిల్లీ సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరారు. ‘నాతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ సీఎంలు ఢిల్లీ ప్రభుత్వ సమస్యల్ని తక్షణం పరిష్కరించాలని ప్రధానిని కోరాం. అయితే ప్రధాని మోదీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఆ విషయాన్ని పరిశీలిస్తానని హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు’ అని సమావేశం అనంతరం పశ్చిమ బెంగాల్‌  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. శనివారం ఈ నలుగురు సీఎంలు అరవింద్‌ కేజ్రీవాల్‌కు మద్దతు తెలపడంతో పాటు.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో ఆందోళన చేస్తున్న కేజ్రీవాల్‌ను కలుసుకునేందుకు ప్రయత్నించారు. ఢిల్లీలో కొనసాగుతున్న సంక్షోభాన్ని ప్రధాని మోదీ వద్ద ప్రస్తావిస్తామని విలేకరుల సమావేశంలో వారు వెల్లడించారు.   

నెలరోజుల్లో ‘నవభారత’ పత్రం
న్యూఢిల్లీ: ‘నవభారతం 2022’ నిర్మాణానికి సంబంధించిన అభివృద్ధి ఎజెండా పత్రాన్ని నెలరోజుల్లో సిద్ధం చేయనున్నట్లు నీతి ఆయోగ్‌ తెలిపింది. ఈ పత్రానికి తుదిరూపునిచ్చాక.. అభిప్రాయాలు, స్పందనల కోసం రాష్ట్రాలకు పంపిస్తామని సమావేశంలో వెల్లడించింది. గత సమావేశంలో పేర్కొన్నదాని ప్రకారం ఈ భేటీలో ఈ పత్రాన్ని రాష్ట్రాలకు అభిప్రాయాల కోసం ఇవ్వాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో నెలరోజులు ఆలస్యం కానుందని నీతి ఆయోగ్‌ అధికారులు తెలిపారు. ‘నవభారతం 2022 అభివృద్ధి ఎజెండా రూపకల్పన చివరి దశలో ఉంది. అందువల్లే నేటి సమావేశంలో దీన్ని ఇవ్వలేకపోతున్నాం.

క్షేత్రస్థాయిలో జరగాల్సిన మార్పులను ఈ ప్రతిపాదన ప్రతిబింబించాలని కోరుకుంటున్నాం. ఇది దాదాపుగా సిద్ధమైనట్లే. త్వరలోనే అభిప్రాయాల కోసం ఈ డాక్యుమెంటును రాష్ట్రాలకు పంపిస్తాం. ఆ తర్వాత విస్తృతమైన చర్చలు జరుగుతాయి. నెల, నెలన్నరలో ఇది అంతా పూర్తవుతుంది’ అని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు. మూడేళ్లు, ఏడేళ్లు, 15 ఏళ్ల లక్ష్యాలను ఏర్పర్చుకుని వీటిని చేరుకునేందుకు దార్శనిక పత్రాల (విజన్‌ డాక్యుమెంట్‌) రూపకల్పన ప్రణాళికలను నీతి ఆయోగ్‌ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 2022 నాటికి (దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు) దేశం ఆరు ప్రధాన సమస్యల (పేదరికం, చెత్త, అవినీతి, ఉగ్రవాదం, కులతత్వం, మతతత్వం) నుంచి విముక్తమయ్యేలా పనిచేయాలని గతేడాది ప్రజెంటేషన్‌లో నీతి ఆయోగ్‌ పేర్కొంది.  


                         మీడియాతో నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌కాంత్, ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement