
బీజేపీలో చేరిన ముస్లిం యువతికి వేధింపులు
లక్నో : ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పథకాలను ప్రశంసిస్తూ బీజేపీలో చేరిన ముస్లిం యువతిని తన ఇంటి యజమాని బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించిన ఘటన అలీగఢ్‌లో చోటుచేసుకుంది. గులిస్తాన్ అనే మహిళ బీజేపీలో సభ్యత్వం తీసుకునే క్రమంలో ఆమె ఫోటో వార్తాపత్రికల్లో, సోషల్ మీడియాలో రావడంతో ఆగ్రహించిన ఆమె ఇంటి యజమాని బలవంతంగా ఇంటి నుంచి ఖాళీ చేయించాడు. బీజేపీలో చేరాననే కోపంతో తాను అద్దెకు ఉంటున్న ఇంటి నుంచి తమ యజమాని తనను దుర్భాషలాడుతూ బలవంతంగా బయటకి గెంటివేశాడని బాధిత మహిళ పేర్కొన్నారు.
దిక్కుతోచని పరిస్థితిలో మహిళ ఇంటి యజమాని, ఆయన కుటుంబ సభ్యులపై స్ధానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా యజమాని సల్మాన్‌ను అరెస్ట్ చేశారు. యజమాని కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.