ఆత్మహత్య ఆలోచనను చంపుతారు!

Mumbai Cyber Police Log Into Facebook To Curb Suicides - Sakshi

ముంబై : 21 ఏళ్ల యువకుడొకరు.. జీతం విషయంలో హోటల్‌ యజమానితో గొడవపడి, మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఫేస్‌బుక్‌లో తన బాధను తెలుపుతూ సూసైడ్‌ నోట్‌  పోస్ట్‌ చేశాడు. ముంబైలోని మీరా రోడ్డు సమీపంలో ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్‌ అయ్యాడు. అంతే నిమిషాల్లో పోలీసులు అతని దగ్గరికి చేరుకున్నారు. అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి కౌన్సిలింగ్‌ ఇచ్చి అతని ఆత్మహత్య ఆలోచనను చంపేశారు. ముంబై సైబర్‌ పోలీసుల ఘనతకు ఇదో చిన్న ఉదాహరణ.

టెక్నాలజీ సాయంతో ఆత్మహత్యల నుంచి యువతను కాపాడుతూ అందరి మన్ననలు పొందుతున్నారు ముంబై సైబర్‌ పోలీసులు. సూసైడ్‌ నోట్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన 24 గంటలలోపు సైబర్‌ పోలీసులు స్పందించి లోకల్‌ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా బాధితుడి ఇంటికి చేరుకొని రక్షించి, సీనియర్‌ పోలీసు అధికారులతో కౌన్సిలింగ్‌ ఇప్పించి వారిని రక్షిస్తున్నారు.

‘ఎక్కడ నుంచైనా సూసైడ్‌ నోట్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే వెంటనే మాకు అలర్ట్‌ వస్తుంది. వారిని రక్షించడానికి కావల్సిన అన్ని అవకాశాలను వినియోగించుకుంటాం. స్పెషల్‌ టీమ్‌లను ఏర్పాటు చేసి వివిధ మార్గాల్లో బాధితున్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తాం. సూసైడ్‌ చేసుకోవాలనే వారి అడ్రస్‌ను ట్రాక్‌ చేసిన వెంటనే లోకల్‌ పోలీసులకు సమాచారం అందిస్తాం. సామాజిక కార్యకర్తల సహాయం కోరుతాం. ఏవిధంగా అతన్ని రక్షించాలో ఆలోచించి వీలైనంత త్వరగా అతడి ఇంటికి చేరుకుంటాం. అనంతరం అతడు/ఆమెను తీసుకెళ్లి కౌన్సిలింగ్‌ ఇప్పిస్తాం. క్షణికావేశాల్లో తీసుకునే నిర్ణయాల జరిగే నష్టాన్ని వివరిస్తాం. వారిలో ఉన్న ఆత్మహత్య ఆలోచనను చంపేందుకు ప్రయత్నిస్తాం. ఈ రెండు మూడు నెలల్లో నలుగురి ప్రాణాలను కాపాడగలిగామ’ని డీసీపీ అక్బర్‌ పఠాన్‌ మీడియాకు తెలిపారు.

‘గోర్‌వావ్‌ సంస్థలో పనిచేసే ఓ 30 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఫేస్‌బుక్‌లో సూసైడ్‌ నోట్‌ను పోస్ట్‌ చేశారు. వెంటనే సైబర్‌ విభానికి చెందిన మహిళా బృందం ఆమె దగ్గరకు వెళ్లారు. ఆమెతో మాట్లాడారు. ఆమెకు గల సమస్యలను తెలుసుకున్నారు. ఆమెకు కౌన్సిలింగ్‌ ఇచ్చి మళ్లి ఇలాంటి పిచ్చి ఆలోచనలు రాకుండా చేశార’ని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇలాగే మరో 21 ఏళ్ల యువకుడిని కూడా రక్షించామని తెలిపారు.
 
టెక్నాలజీని సద్వినియోగం చేసుకొని ప్రాణాలను కాపాడుతున్నారు ముంబై పోలీసులు. ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో సూసైడ్‌, మర్డర్‌, ఇతర సున్నితమైన విషయాలు పోస్ట్‌ చేస్తే తమకు అలర్ట్‌ వచ్చేలా ఏర్పాటు చేశారు. దీనికి ఓ స్పెషల్‌ టీమ్‌ను నెలకొల్పి నిమిషాల్లో బాధితుల్ని చేరుకునేలా వ్యవస్థను రూపకల్పిన చేశారు. క్షణికావేశాల్లో తీసుకున్న నిర్ణయాల నుంచి కాపాడుతూ ఎంతో మందికి పునఃజన్మ ఇస్తున్న ముంబై సైబర్‌ పోలీసులపై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top