‘అవినీతిపరులకు దీదీ వత్తాసు’

 Modi Says West Bengal CM Sits On Dharna To Save The Corrupt - Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అవినీతిపరుల కొమ్ము కాస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పేదల సొమ్మును లూటీ చేసిన వారిని సమర్దిస్తూ ఆమె ధర్నా చేపట్టారని ధ్వజమెత్తారు. అవినీతిపరులను కాపాడేందుకు తొలిసారిగా ఓ సీఎం ధర్నా చేశారని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. దీదీ ప్రభుత్వం కమ్యూనిస్టుల బాటలో పయనిస్తోందన్నారు. కమ్యూనిస్టులకు బీ టీమ్‌గా తృణమూల్‌ కాంగ్రెస్‌ తయారైందన్నారు.

బెంగాల్‌ ప్రజలను, ఇక్కడి మధ్యతరగతి, పేదలను దళారీలకు వదిలేసిన ఆమె ప్రధాని పదవిపై కన్నేశారని విమర్శించారు. జల్పాయిగురి జిల్లాలో శుక్రవారం జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ మమతా సర్కార్‌పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. కోల్‌కతా పోలీస్‌ కమీషనర్‌ నివాసంపై సీబీఐ దాడులకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ధర్నాతో రాజకీయ దుమారం నెలకొన్న అనంతరం ప్రధాని బెంగాల్‌లో పాల్గొన్న తొలి ర్యాలీ ఇదే కావడం గమనార్హం.

మమతా సారథ్యంలోని తృణమూల్‌ ప్రభుత్వం చొరబాటుదారులను స్వాగతిస్తూ బీజేపీ నేతలను రాష్ట్రంలో పర్యటించకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. బీజేపీ అంటే తృణమూల్‌ ఉలికిపాటుకు ఇదే సంకేతమన్నారు. స్కామ్‌స్టర్‌లను కాపాడే వారెవరినీ తాను విడిచిపెట్టనని హెచ్చరించారు. సిద్ధాంత వైరుధ్యాలు కలిగిన పార్టీలు మహాకూటమి అంటూ ప్రజల ముందుకొచ్చాయన్నారు.

త్రిపురలో ఎర్రజెండాను నామరూపాల్లేకుండా చేసిన బీజేపీ పశ్చిమ బెంగాల్‌లోనూ అదే జోరును పునరావృతం చేస్తుందన్నారు. కాంగ్రెస్‌, లెఫ్ట్‌, తృణమూల్‌తో బెంగాల్‌ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. వారికి పేదల ప్రజల సంక్షేమంపై ఎలాంటి ఆసక్తి లేదన్నారు. ఉత్తర బెంగాల్‌లో నానాటికీ శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా జల్పాయిగురిలో హైకోర్టు సర్క్యూట్‌ బెంచ్‌ను ప్రధాని ప్రారంభించారు. 31వ జాతీయ రహదారిపై నాలుగు వరసల రహదారి పనులకు శంకుస్దాపన చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top