
మసూద్ అజార్, హఫీజ్ మహమ్మద్ సయీద్, జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, దావూద్ ఇబ్రహీం
న్యూఢిల్లీ: జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంలను వ్యక్తిగత హోదాలో ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) సవరణ చట్టం(యూఏపీఏ)–1967కు కీలక సవరణలకు పార్లమెంటు ఆమోదం తెలిపిన ఒక నెలలోనే ఈ నలుగురిని కొత్త చట్టం కింద ఉగ్రవాదులుగా ప్రకటించినట్లు కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు.
ఇప్పటివరకు యూఏపీఏ కింద చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సంస్థలనే ఉగ్రవాదులుగా ప్రకటించేవారు. కానీ కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం వ్యక్తుల్ని సైతం ఉగ్రవాదులుగా ప్రకటించే వెసులుబాటు ఉంది. ఈ చట్టం కింద ఉగ్రవాదుల్ని ప్రకటించడం ఇదే మొదటిసారి. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వీరిని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రవేసి వారిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది.