మార్స్ ప్రభావ క్షేత్రంలోకి మామ్! | Mars Orbiter Mission is on stable trajectory: ISRO chief | Sakshi
Sakshi News home page

మార్స్ ప్రభావ క్షేత్రంలోకి మామ్!

Sep 22 2014 2:10 AM | Updated on Sep 2 2017 1:44 PM

మార్స్ ప్రభావ క్షేత్రంలోకి మామ్!

మార్స్ ప్రభావ క్షేత్రంలోకి మామ్!

భారత ‘మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్, మంగళ్‌యాన్)’ ఉపగ్రహం నేడు అంగారక ప్రభావ క్షేత్రంలోకి అడుగుపెట్టనుంది. పది నెలలుగా రోదసిలో నిరంతరం మార్స్ వైపు ప్రయాణిస్తున్న మామ్ మరో రెండురోజుల్లోనే..

నేడు ఉపగ్రహ ఇంజన్‌కు కీలక పరీక్ష
* నాలుగో మార్గ సవరణకు కసరత్తు
* 24న మార్స్ కక్ష్యలోకి మామ్‌ను ప్రవేశపెట్టేందుకు ఇస్రో సన్నాహాలు
* తుది ఘట్టానికి భారత అంగారక యానం

 
బెంగళూరు: భారత ‘మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్, మంగళ్‌యాన్)’ ఉపగ్రహం నేడు అంగారక ప్రభావ క్షేత్రంలోకి అడుగుపెట్టనుంది. పది నెలలుగా రోదసిలో నిరంతరం మార్స్ వైపు ప్రయాణిస్తున్న మామ్ మరో రెండురోజుల్లోనే.. సరిగ్గా బుధవారం తెల్లవారుజామున అరుణుడిని చేరుకోనుంది. ఇందుకు కీలకమైన నాలుగో మార్గసవరణను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సోమవారం చేపట్టనుంది. ఉపగ్రహంలో నిద్రాణ స్థితిలో ఉన్న ద్రవ అపోజీ మోటారు(లామ్) ఇంజన్‌ను కూడా నేడు 3.968 సెకన్ల పాటు మండించి దాన్ని పరీక్షించనుంది. సెకనుకు 22.1 కి.మీ. వేగంతో దూసుకుపోతున్న మామ్.. అంగారకుడిని సమీపించేలోగా సెకనుకు 4.4 కి.మీ. వేగానికి తగ్గాలి.
 
అప్పుడే ఉపగ్రహాన్ని అంగారకుడు తనవైపు లాక్కుంటాడు. లేకపోతే ఉపగ్రహం మార్స్ గురుత్వాకర్షణను తప్పించుకుని ముందుకు దూసుకుపోతుంది. అందుకే.. బుధవారం తెల్లవారుజామున ఉపగ్రహం మార్స్‌ను సమీపించేసరికి.. లామ్ ఇంజన్‌ను 24 నిమిషాల పాటు మండించి ఉపగ్రహ వేగాన్ని తగ్గించడం అనేది అత్యంత కీలకం కానుంది. ఉపగ్రహం మార్స్ చుట్టూ కక్ష్యలోకి చేరేందుకు అతిముఖ్యమైన ఈ రెండు ప్రక్రియలు చేపట్టేందుకు ఆదేశాలు ఇవ్వడం పూర్తిచేశామని  ఇస్రో అధికారులు వెల్లడించారు. ఒకవేళ లామ్ ఇంజన్ పనిచేయకపోయినా.. ప్రత్యామ్నాయంగా 8 థ్రస్టర్లను ఎక్కువ సేపు మండిం చడం ద్వారా కూడా ఉపగ్రహాన్ని మార్స్ కక్ష్యలోకి చేర్చవచ్చని తెలిపారు.
 
అరుణయానంలో త్రివర్ణ రెపరెపలు...

భారత్ గ్రహాంతర యానం చేపట్టడం ఇదే తొలిసారి. గతేడాది నవంబరు 5న శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-25 రాకెట్ ద్వారా మామ్‌ను నింగికి పంపి అంగారక యాత్రను ఇస్రో ప్రారంభించడం తెలిసిందే. రోదసిలో 300 రోజుల సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసిన మామ్ మరో 48 గంటల్లోనే మార్స్‌ను చేరుకోనుంది. ఇస్రో అంగారక యాత్రలో ఈ తుది ఘట్టం కూడా విజయవంతం అయితే గనక.. మార్స్‌కు ఉపగ్రహాన్ని పంపిన ఏకైక ఆసియా దేశం, తొలిప్రయత్నంలోనే మార్స్‌కు వ్యోమనౌకను పంపిన ఒకే ఒక్క దేశం, అమెరికా, రష్యా, ఐరోపాల తర్వాత అంగారక యాత్రను విజయవంతంగా చేపట్టిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది.
 
నేడు మార్స్ కక్ష్యలోకి అమెరికా ‘మావెన్’
మంగళ్‌యాన్ కన్నా రెండు వారాలు ఆలస్యంగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన మావెన్ ఉపగ్రహం భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 6:00 గంటలకు మార్స్ కక్ష్యలోకి ప్రవేశించనుంది. పది నెలల్లో మామ్ కన్నా 10 కోట్ల కి.మీ. తక్కువగా  70.4 కోట్ల కి.మీ ప్రయాణించిన మావెన్ రెండు రోజులు ముందుగానే అంగారకుడిని చేరుతోంది. మావెన్ ఇంజన్లను 33 నిమిషాల పాటు మండించి మార్స్ చుట్టూ 35 గంటల వ్యవధి గల కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు నాసా వెల్లడించింది. కాగా, అరుణగ్రహ వాతావరణంలోని పైపొరను మావెన్ అధ్యయనం చేయనుంది.
 
డిజైన్ రూపొందిస్తే.. 12 లక్షలు!  
అంగారకుడిపైకి చిన్నచిన్న శాస్త్రీయ పరికరాలను పంపేందుకుగాను.. బరువును నియంత్రించుకుంటూనే మార్స్ వాతావరణంలోకి సురక్షితంగా ప్రవేశించగల వ్యోమనౌకల డిజైన్ చేసినవారికి రూ.12 లక్షల బహుమతి ఇస్తామంటూ నాసా ఓ పోటీని ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement