భారత్‌లో సిరియన్ల కోసం వేట | Sakshi
Sakshi News home page

భారత్‌లో సిరియన్ల కోసం వేట

Published Wed, Jan 20 2016 3:03 PM

భారత్‌లో సిరియన్ల కోసం వేట - Sakshi

న్యూఢిల్లీ: సిరియా నుంచి భారత్‌కు వచ్చిన సిరియా దేశస్థుల్లో వందమంది వీసా గడువు ముగిసి పోయినప్పటికీ వారి దేశం తిరిగి వెళ్లకుండా దేశంలోనే తప్పించుకు తిరుగుతున్నారు. వారిలో ఎక్కువ మంది యువకులే ఉండడం, వారికి  ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉండే అవకాశం ఉండడంతో భారత భద్రతా దళాలు వారిని వెతికి పట్టుకునేందుకు వేట సాగిస్తున్నాయి.

వారిలో కొంతమంది యువకులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాల్లో తలదాచుకున్నట్టు సమాచారం అందడంతో వారి ఆచూకి కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశామని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఉన్నత ప్రభుత్వాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. వారిలో ఎక్కువ మంది వైద్య చికిత్స నిమిత్తం, పర్యాటక కోసం రాగా, కొంత మంది 15 రోజుల ట్రాన్సిట్ వీసాలపై వచ్చారని ఆయన తెలిపారు.

 

వైద్యం, పర్యాటక కోసం వచ్చేవారికి రెండు వారాల నుంచి ఆరు నెలలపాటు భారత్‌లో ఉండేందుకు వీసాలు జారీ అయ్యాయని, గతేడాది భారత్‌కు వచ్చి తిరిగి వెళ్లని వారు వందమంది ఉన్నారని, అలాంటి వారి జాబితాను రూపొందించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించామని ఆ అధికారి వివరించారు. వారిలో కొంత మంది పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు.

 కొంతమంది సిరియన్లు భారత్‌కు వచ్చారని, వారు ఐక్యరాజ్య సమతి మార్గదర్శకాల ప్రకారం భారత ప్రభుత్వాన్ని శరణుకోరుతున్నారని, వారిలో కొంతమందికి  టెర్రరిస్టు సంస్థలతో సంబంధాలు కూడా ఉన్నాయని భారత్‌లోని సిరియా అంబాసిడర్ రియాద్ కామెల్ అబ్బాస్ స్వయంగా ఇటీవల ప్రకటించడం ఇక్కడ గమనార్హం.

Advertisement
Advertisement