పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దీదీ మెగార్యాలీ!

Mamata Banerjee Holds Mega Rally In Kolkata Against Citizenship Law - Sakshi

కోల్‌కతా: బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేటి మధ్యాహ్నం ఒంటిగంటకు కోల్‌కతాలో మెగార్యాలీని నిర్వహించనున్నారు. రెడ్రోడ్‌లోని బాబాసాహేబ్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ జోరాసంకో ఠాకుర్బారి వద్ద ముగుస్తుందని మమత ట్విటర్‌లో పేర్కొన్నారు. అంతేగాక ప్రజలు శాంతియుతంగా ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ.. కొల్‌కతాలోని ఆందోళనకారులు రహదారి, రైలు మార్గాలను దిగ్బందనం చేసి అడ్డుకుంటుండంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరసనల కారణంగా అనేక రైళ్లు ఆలస్యం కాగా.. మరికొన్ని రద్దయ్యాయి.

ఇక వివాదాస్పద పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనకారులు బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌, మాల్డా, హౌరా జిల్లాల్లోని రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకొని నిప్పంటించి.. తీవ్రంగా ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్డా, ఉత్తర దినజ్‌పూర్, ముర్షిదాబాద్, హౌరా, నార్త్ 24 పరగణాలు, సౌత్‌ 24 పరగణ అనే ఆరు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. ఈ జిల్లాల్లో సవరించిన చట్టంపై ఆందోళనలు తీవ్రతరం కావడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఇక  పశ్చిమ బెంగాల్  గవర్నర్ జగదీప్ ధంకర్ ఆదివారం సీఎం మమతా బెనర్జీ తీరును తప్పుబడుతూ..  పోలీసుల కోసం ఖర్చు చేయాల్సిన ప్రజా ధనాన్ని.. చట్టానికి వ్యతిరేకంగా  టెలివిజన్‌లలో ప్రచారానికి వృథా చేస్తున్నారని విమర్శించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top