29న కొచ్చి ఎయిర్‌పోర్టు సిద్ధం

Kochi airport to reopen on Aug 29 - Sakshi

కొచ్చి: భారీ వరదల కారణంగా వారం రోజులుగా విమానసేవలు రద్దయిన కొచ్చి విమానాశ్రయం ఆగస్టు 29 నుంచి పూర్తిస్థాయి సేవలను అందించేందుకు సిద్ధమైంది. విమానాశ్రయంలో బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో విమానాల నియంత్రణ వ్యవస్థకు జరిగిన నష్టంపై అధికారులు చర్చించారు.  90 శాతం మంది విమానాశ్రయ ఉద్యోగులు వరదబాధితులే. వారంతా ఇంకా వాళ్ల సొంతూళ్లలో చిక్కుకుపోయారు. ఎయిర్‌పోర్టు సమీపంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు తెరుచుకోలేదు. ‘మధ్య కేరళ ఇంకా వరద ప్రభావం నుంచి కోలుకోవాల్సి ఉన్నందున.. ఉద్యోగులకు సమాచారం ఇవ్వలేకపోతున్నాం. ఇతర సదుపాయాలు, కేటరింగ్‌ అంశాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు. ఆగస్టు 29 మధ్యాహ్నం 2 గంటలనుంచి తిరిగి సేవలు మొదలవుతాయి’ అని విమానాశ్రయ అధికార ప్రతినిధి వెల్లడించారు.

దేశంలో రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన కొచ్చి ఎయిర్‌పోర్టు.. తాజా వరదలు, విమాన సేవల నిలిపివేత కారణంగా రూ.220 కోట్లను నష్టపోయింది. పెరియార్‌ నదికి వరదల కారణంగా రన్‌వే, టాక్సీ బే, కస్టమ్స్‌ పన్నుల్లేని వస్తువులు, ఇంటర్నేషనల్, డొమెస్టిక్‌ టర్నినల్స్‌ నీట మునిగాయి. రన్‌వేపై లైట్లు కూడా పూర్తిగా పాడయ్యాయి. పలు ఎలక్ట్రికల్‌ పరికరాలు కూడా ధ్వంసమయ్యాయి. 2.26 కిలోమీటర్ల మేర విమానశ్రయం గోడలు పాడయ్యాయి. ప్రపంచంలోనే తొలి సౌరశక్తి ఆధారిత విమానాశ్రయమైన కొచ్చిలో ఈ సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థకు కూడా తీవ్రంగా నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. కాగా, కొచ్చిలోని నేవల్‌ ఎయిర్‌బేస్, ఐఎన్‌ఎస్‌ గరుడలపై తాత్కాలిక విమానసేవలు సోమవారం ప్రారంభమయ్యాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top