కేరళ నర్సుకు సోకిన కరోనా వైరస్‌

Kerala Nurse in Saudi Arabia Infected With Corona Virus - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన ఓ నర్సుకు ప్రాణాంతక కరోనా వైరస్‌ సోకింది. సౌదీ అరేబియాలోని అల్ హయత్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న కేరళ నర్సుకు కరోనా వైరస్‌ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ సహాయ మంత్రి వీ మురళీధరన్‌ కూడా ధ్రువీకరించారు. దీనిపై ఆయన ట్విటర్‌లో ఓ పోస్ట్‌ కూడా చేశారు. సౌదీలో పనిచేస్తున్న 100 మంది భారత నర్సులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో చాలా మంది కేరళకు చెందినవారే. అయితే కేరళ చెందిన ఓ నర్సుకు మాత్రం ఈ వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. వైరస్‌ సోకిన నర్సుకు అసీర్‌ నేషనల్‌ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నార’ని తెలిపారు. అలాగే మిగతా నర్సులకు కరోనా వైరస్‌ సోకకుండా జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు తెలిపారు. 

జెడ్డాలోని భారత కాన్సులేట్‌ అధికారులతో ఈ అంశంపై మాట్లాడినట్టు తెలిపారు. కాన్సులేట్‌ అధికారులు సౌదీ విదేశాంగ శాఖతోపాటు హాస్పిటల్‌ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు.  ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌.. విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జయశంకర్‌కు లేఖ రాశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా సౌదీ ప్రభుత్వంతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి.. మిగిలిన నర్సులకు కరోనా వైరస్‌ సోకకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని విజయన్‌ కేంద్రాన్ని కోరారు. కాగా, చైనాలో కరోనా వైరస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 17కి చేరింది. అలాగే, ఇప్పటివరకు 634 మందికి  ఈ వైరస్‌ సోకినట్టు గుర్తించారు.

మరోవైపు కరోనా వైరస్‌ భారత్‌లో ప్రవేశించకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిన్‌ విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను పరీక్షించి, వారిలో ఈ వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ లేదని నిర్ధారించారు. మంగళవారం వరకు 43 విమానాల ద్వారా వచ్చిన 9,156 మంది ప్రయాణీకులను పరీక్షించామని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. కరోనా వైరస్‌కు సంబంధించి ఇప్పటివరకు ఏ ఒక్క కేసు నమోదు కాలేదని పేర్కొంది. చైనాలోని భారత రాయబార కార్యాలయం తమకు ఈ వైరస్‌కు సంబంధించిన తాజా వివరాలను క్రమం తప్పకుండా అందజేస్తోందని తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top