మెరుగవుతున్న కరుణ ఆరోగ్యం

Karunanidhi's Health Has Improved, Says Son MK Stalin - Sakshi

డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ ప్రకటన

ఎలాంటి వదంతుల్ని నమ్మవద్దని కార్యకర్తలు, ప్రజలకు విజ్ఞప్తి

సాక్షి ప్రతినిధి, చెన్నై: ద్రావిడ మున్నేట్ర కజగం(డీఎంకే) అధినేత ఎంకే కరుణానిధి(94) ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడుతోందని ఆయన కొడుకు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ స్పష్టంచేశారు. గొంతులో అమర్చిన ట్రాకియాస్టమీ ట్యూబ్‌ మార్పిడి కారణంగా కరుణకు స్వల్పంగా జ్వరం, ఇన్ఫెక్షన్‌ సోకిందన్నారు. ప్రస్తుతం జ్వరంతో పాటు శరీరంలోని ఇన్ఫెక్షన్‌ తగ్గుముఖం పడుతోందన్నారు. కరుణానిధి ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యుత్తమ వైద్యుల బృందం 24 గంటల పాటు కరుణకు చికిత్స అందజేస్తోందని స్టాలిన్‌ తెలిపారు. కలైంజర్‌ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నందున గోపాలపురంలోని ఆయన నివాసానికి రావొద్దని పార్టీ నేతలు, కార్యకర్తలు, సాధారణ ప్రజలను స్టాలిన్‌ కోరారు.

పరామర్శల వెల్లువ..
కరుణ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్రపతి  కోవింద్, ప్రధాని∙మోదీ, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ తదితరులు  స్టాలిన్, కుమార్తె కణిమొళికి ఫోన్‌ చేసి కరుణ∙ఆరోగ్యంపై వాకబు చేశారు. తండ్రి అనారోగ్యం నేపథ్యంలో కరుణ పెద్ద కుమారుడు అళగిరి తన కుమారుడు దురై దయానిధిని వెంటపెట్టుకుని గోపాలపురంలోని ఇంటికి శుక్రవారం చేరుకున్నారు. డీఎంకే అధినేతగా కరుణానిధి శుక్రవారంతో 50వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ ఆయన కుమారుడు స్టాలిన్‌ స్పందించారు.‘ సవాళ్లను విజయాలుగా మార్చుకునే మన నాయకుడు గత 50 సంవత్సరాలుగా తమిళనాడు రాజకీయాల్లో దృఢమైన శక్తిగా ఉన్నారు’ అని ట్వీట్‌ చేశారు.

కొనసాగిన ఉత్కంఠ..
కరుణ ఆరోగ్యం స్వల్పంగా క్షీణించిందని కావేరీ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించడంతో డ్రామా మొదలైంది. డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, తోటి మంత్రులు కరుణ ఇంటికి వెళ్లి స్టాలిన్‌ను కలవడం, ఇంటివద్ద పెద్ద సంఖ్యలో పోలీసుల్ని మోహరించడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో టెన్షన్‌ పెరిగింది. మెరీనా బీచ్‌లోని అన్నాదురై సమాధి దగ్గర ప్రభుత్వం స్థల పరిశీలన చేస్తోందని వార్తలొచ్చాయి. చివరకు కరుణ ఆరోగ్యం మెరుగుపడుతోందని స్టాలిన్‌ ప్రకటించినప్పటికీ ఆయన ఇంటివద్ద నేతలు, కార్యకర్తల్లో ఆందోళన తగ్గలేదు. కాగా, కరుణకు పూర్తి విశ్రాంతి అవసరమని డీఎంకే వర్గాలు తెలిపాయి. ముందస్తుగా ఖరారైన పర్యటన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆదివారం చెన్నైకి చేరుకోనున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top