మంకీ ఫీవర్‌ పంజా

Karnataka People Suffering With Monkey Fever - Sakshi

 ఉత్తర కన్నడ జిల్లాలో విదేశీ పర్యాటకురాలికి జ్వరం  

మల్నాడు జిల్లాల్లో కలకలం  

బర్డ్‌ ఫ్లూ, స్వైన్‌ ఫ్లూ తరువాత మంకీ ఫీవర్‌ ప్రజలను వణికిస్తోంది. కోతుల నుంచి జంతువులకు, వాటి నుంచి మానవులకు వ్యాపించే ఈ జ్వరం ప్రాణాంతకంగా మారుతోంది. చిక్కమగళూరు, శివమొగ్గ తదితర జిల్లాల్లో తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. వ్యాప్తిని అరికట్టడానికి చిక్కమగళూరు జిల్లాలో ఏకంగా పర్యాటకుల రాకను నిషేధించారు.  

సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో పలుజిల్లాల్లో మంకీ ఫీవర్‌ (కోతి జ్వరం) వ్యాపిస్తోంది. చిక్కమగళూరు, శివమొగ్గ, ఉత్తర కన్నడ తదితర మల్నాడు జిల్లాల్లో విస్తరిస్తున్న ఈ వ్యాధి ఒక విదేశీ పర్యాటక మహిళకు సోకింది. ఇప్పటికే పదిమంది వరకూ బలి తీసుకున్న మంకీ ఫీవర్‌ ఉత్తర కన్నడ జిల్లా పర్యాటకానికి వచ్చిన నేపాల్‌ మహిళకు వ్యాపించింది. ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో కుమాటాలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ మంకీ ఫీవర్‌ లక్షణాలు కనిపించడంతో మెరుగైన చికిత్స కోసం మణిపాల్‌లోని కేఎంసీ ఆస్పత్రికి తరలించారు. పై జిల్లాల్లో ఇప్పటివరకు 150 మందికి పైగా వైరస్‌ సోకింది. మరోవైపు మంకీ ఫీవర్‌ విస్తరించకుండా చిక్కమగళూరు జిల్లాలో పర్యాటకుల రాకపోకలను నిషేధించారు. 

మంకీ ఫీవర్‌ అంటే?  
గతేడాది డిసెంబర్‌ నెలలో శివమొగ్గ జిల్లాలో ఈ మంకీ ఫీవర్‌ వెలుగులోకి వచ్చింది. తొలుత 1957లో ఒక కోతిలో ఈ వైరస్‌ను గుర్తించారు. శివమొగ్గ జిల్లా సొరబ తాలూకాలోని క్యాసనూరు గ్రామంలో తొలుత ఈ మంకీ ఫీవర్‌కు కారణమైన వైరస్‌ను గుర్తించారు. దీంతో ఆ వైరస్‌కు క్యాసనూర్‌ అని పేరు పెట్టారు. ఈ వైరస్‌ సోకిన కోతి నుంచి మానవులకు అంటుకుంటోంది. కోతుల్లోని ఈ వైరస్‌ గాలి ద్వారా పశువులకు, మనుసులకు సోకుతుంది. కానీ మనిషి నుంచి మనిషికి ఈ వైరస్‌ సోకదని నిపుణులు చెబుతున్నారు.  

ఇవీ లక్షణాలు
వైరస్‌ సోకిన తర్వాత ఒక వారం వరకు ఎలాంటి లక్షణాలను చూపించదు.  
వారం తర్వాత విపరీతమైన జ్వరం, తలనొప్పి, నరాల బలహీనత, కండరాల తిమ్మిరి, వాంతులు కనిపిస్తాయి.  
వ్యాధి తీవ్రతరమయ్యాక నోరు, చిగుళ్లు, ముక్కు నుంచి రక్తం కారుతుంది.  
బీపీ, ఎర్ర రక్తకణాలు బాగా తగ్గిపోతాయి. రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది.   
వ్యాధి ముదిరితే మతిస్థిమితం కోల్పోవచ్చు.  
ఈ వ్యాధి వస్తే మరణించే అవకాశాలు 3–5 శాతం ఉంటాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top