ఏమి ఆ వేగం.. బోల్ట్‌ను మించి పోయాడు..!

Karnataka Man Runs Faster Than Usain Bolt In Ancient Buffalo Race - Sakshi

సాక్షి, బెంగుళూరు : చిరుత పులిలా పరుగెత్తే స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ వేగం చూసి ఆశ్చర్యపోయాం. అబ్బురపడ్డాం..! మన పొరుగునే ఉన్న కర్ణాటక యువకుడొకరు అలాంటి వేగాన్నే పరిచయం చేశాడు. ప్రధానంగా మంగుళూరు, ఉడిపి ప్రాంతాల్లో నిర్వహించే సంప్రదాయ ‘కంబాల’క్రీడలో శ్రీనివాస గౌడ (28) ముప్పయ్‌ ఏళ్ల రికార్డును తిరగరాశాడు. దక్షిణ కన్నడ జిల్లాలోని మూడబిద్రికి చెందిన ఈ రేసర్‌ 13.62 సెకండ్లలో 142.50 మీటర్లు పరుగెత్తి.. ఉసేన్‌ బోల్ట్‌ (9.58 సెకండ్లలో 100 మీటర్లు) ప్రపంచ రికార్డును గుర్తు చేశాడు.

142.50 మీటర్ల దూరాన్ని 100 మీటర్లకు లెక్కించినపుడు.. కన్నడ యువకుడు ‘జైమైకా చిరుత’ కన్నా 0.03 సెకండ్లు ముందంజలో ఉండటం విశేషం. రెండు దున్నపోతులతో పాటు పరుగెత్తే ఈ క్రీడను బురదమయమైన పంట పొలాల్లో నిర్వహిస్తారు. ఇక శ్రీనివాస గౌడ బోల్ట్‌ కన్నా వేగంగా పరెగెత్తుతున్నాడని సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత ప్రభుత్వం అతన్ని ఒలింపిక్స్‌కు తయారు చేయించాలని కొందరు నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. అయితే, వేగంగా పరుగెత్తే దున్నల వల్లనే శ్రీనివాస గౌడ పరుగు ముడిపడి ఉందని గమనించడం మరువొద్దు..!

కంబాల అంటే ఎంతో ఇష్టం..,
‘బురద పొలంలో రెండు దున్నలను పరుగెత్తిస్తూ.. వాటితో పాటు లక్ష్యాన్ని చేరుకోవడమే ఈ క్రీడ. సంస్కృతి పరిరక్షణే ధ్యేయంగా నిర్వహిస్తున్నకంబాల క్రీడలో ప్రధానంగా యువకులు పాల్గొంటారు. నాకు కంబాల అంటే ఎంతో ఇష్టం. ఈ విజయం నా దున్నల వల్లనే సాధ్యమైంది. అవి వేగంగా పరుగెత్తడంతో.. నేనూ అంతే వేగంగా పరుగెత్తగలిగా’అని శ్రీనివాస గౌడ ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా.. పశువులను హింస పెడుతున్నారని జంతు ప్రేమికుల అభ్యంతరం గతంలో కొన్నాళ్లపాటు కంబాలను నిషేధించారు. సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఈ ఆటను పునరుద్ధరించారు. కంబాల ఆటలో గెలిచిన వారికి లక్షల్లో బహుమతి కూడా ఉంటుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top