మోదీని విమర్శిస్తే చంపేస్తారట!

Journalists gets threat calls from Modi followers - Sakshi

న్యూఢిల్లీ:
దేశంలోని వివిధ మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు నోయిడా, ఢిల్లీ పరిసర ప్రాంతాల నుంచి చంపేస్తామంటూ బెదిరింపులు, హెచ్చరికలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ, ఆరెస్సెస్‌లకు వ్యతిరేకంగా మీడియాలో ఎలాంటి వార్తలు వచ్చినా గౌరీ లంకేష్‌కు పట్టిన గతే తమకూ పడుతుందన్నది ఆ బెదిరింపుల సారాంశం. సెప్టెంబర్‌ ఐదవ తేదీన బెంగళూరులో ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెల్సిందే.

ఇప్పుడు అలాంటి బెదిరింపులే దాదాపు ఏడు మంది జర్నలిస్టులకు వాట్సాప్‌ సందేశాల ద్వారా, ఫోన్‌ కాల్స్, ఇంటర్నెట్‌ వాయిస్‌ మెసేజ్‌ల ద్వారా వచ్చాయి. వీటిపై నోయిడా పోలీసులు ఇప్పటికి మూడు కేసులను నమోదు చేసుకున్నారు. ఈ మూడు ఫిర్యాదుల్లో ఒక ఫిర్యాదును సైబర్‌ సెల్‌ విభాగం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని నోయిడా నగరం పోలీసు సూపరింటెండెంట్‌ అరుణ్‌ కుమార్‌ తెలిపారు. ఇంటర్నెట్‌ నుంచి వచ్చే వాయిస్‌ మెసేజ్‌లను ఎవరు పంపించారో తెలుసుకోవడం కష్టమని చెప్పారు. మిగతా ఫిర్యాదులను దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. బెదిరింపులన్నీ హిందీ భాషలోనే ఉన్నాయని, బెదిరింపులు వచ్చిన ఫోన్‌ నెంబర్లకు తిరిగి ఫోన్‌ చేయగా, స్విచ్ఛాఫ్‌ లేదా అవుట్‌ ఆఫ్‌ రీచ్‌ అని సమాధానాలు వస్తున్నాయని వారు చెప్పారు. హిందుత్వాన్ని విమర్శించినా, ప్రశ్నించినా ముస్లిలకు పట్టే గతే తమకు పడుతుందని హెచ్చరిస్తున్నారని జర్నలిస్టులు తెలిపారు.

ఈ నెల సెప్టెంబర్‌ 16వ తేదీన మొదటిసారి తనకు బెదిరింపు వచ్చిందని ‘ది క్వింట్‌’లో పనిచేస్తున్న జర్నలిస్ట్‌ సోహినీ గుహో రాయ్‌ ఆరోపించారు. ఓంప్రకాష్‌ మిశ్రా ‘బోల్‌ నా ఆంటీ ఆవో క్యా’ అనే పాటలో ఉన్న అసభ్యత గురించి ప్రశ్నించినందుకు తనకు బెదిరింపు కాల్స్‌ వచ్చాయని ఆమె తెలిపారు. సెప్టెంబర్‌ 17 నుంచి 20వ తేదీ మధ్య తన ఇద్దరు సహచర జర్నలిస్టులకు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయని ఆమె చెప్పారు. మోదీ ప్రభుత్వాన్నిగానీ, పార్టీనిగా విమర్శిస్తే గౌరీ లంకేష్‌కు పట్టిన గతే తనకు పడుతుందని రెండు ఫోన్‌ నెంబర్ల నుంచి మూడుసార్లు ఫోన్‌ బెదిరింపులు వచ్చాయని ‘ఫస్ట్‌ఫోస్ట్‌’ చీఫ్‌ రిపోర్టర్‌ దేవ్‌వ్రత్‌ ఘోష్‌ తెలిపారు. ఆసియన్‌ న్యూస్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన జర్నలిస్ట్‌ కూడా అభయ్‌ కుమార్‌ ఇలాంటి ఫిర్యాదే చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top