
జార్ఖండ్‌లో స్వామి అగ్నివేష్‌పై బీజేపీ కార్యకర్తల దాడి
రాంచీ : సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌పై జార్ఖండ్‌లో మంగళవారం బీజేవైఎం, వీహెచ్‌పీ, ఆరెస్సెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పకూర్ ప్రాంతంలో అగ్నివేష్‌పై దాడికి దిగిన కార్యకర్తలు ఆయనను తీవ్రంగా కొట్టడంతో పాటు దుస్తులు చించివేశారు. అగ్నివేష్ రాకను వ్యతిరేకిస్తూ జార్ఖండ్‌లో బీజేపీ కార్యకర్తలు నిరసనలకు దిగారని, ఆయన క్రిస్టియన్ మిషనరీలతో కలిసి జార్ఖండ్‌లో గిరిజనులను వేధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నట్టు దైనిక్ జాగరణ్ తెలిపింది.
అగ్నివేష్ బసచేసిన హోటల్ వద్ద ఉదయం నుంచి వేచిఉన్న బీజేపీ కార్యకర్తలు ఆయన బయటకు రాగానే ఒక్క ఉదుటున దాడికి తెగబడ్డారు. బీఫ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయని వారు మండిపడ్డారు.
కాగా, అగ్నివేష్ గతంలో హర్యానాలో ఎమ్మెల్యేగా వ్యవహరించడంతో పాటు రాజకీయాల నుంచి వైదొలగే ముందు మంత్రి పదవినీ నిర్వహించారు. అన్నా హజారే నేతృత్వంలో అవినీతి వ్యతిరేక పోరాటంలో అగ్నివేష్ చురుకుగా పాల్గొన్నారు.